
కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అంతర్జాతీయంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా అభివర్ణించారు. భారత్‌లో దేశీయంగా అనేక టీకాలు తయారవుతున్న విషయం తమకు తెలుసని పేర్కొన్నారు. ఆయా సంస్థలతో ఐరాస సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు భారత్ సైతం సిద్ధంగా ఉందని తాము ఆశిస్తున్నామన్నారు.
కరోనా టీకా ప్రపంచదేశాలకు వీలైనంత త్వరగా చేరే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాల తయారీ లైసెన్స్‌లను ఆయా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ఇప్పటి వరకు 55 లక్షల డోసులను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బహుమానంగా పంపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొవిడ్‌ను రూపుమాపడంలో భారత ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ఐరాస పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలో కరీబియన్ దేశాలతో పాటు, ఒమన్, నికరాగ్వా, పసిఫిక్ ద్వీప దేశాలకు సైతం టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం తెలిపారు. అలాగే ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా కోటి డోసుల్ని, ఐరాసకు 10 లక్షల డోసుల్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.





