
దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు..లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త మెనూలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. ఇంతకముందు క్యాంటీన్‌లో అత్యంత చౌకగా ఒక చపాతీ రూ.1కి లభిస్తుండగా ప్రస్తుతం దానిని రూ.3లు చేశారు. వెజ్ బఫె ధరను రూ.500కు, నాన్ వెజ్ బఫెను రూ.700లకు పెంచుతూ మార్పులు చేసినట్లు సచివాలయం వెల్లడించింది. హైదరాబాదీ మటన్ బిర్యానీని ఇన్ని రోజులు రూ.65కి అందించేవారు. ఇప్పుడు ఆ ధరను రూ.150కు పెంచారు. అలాగే వెజ్ మీల్ ఇక నుంచి రూ.100కి లభించనుంది. కాగా, ఈ నెల 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

ఈ చర్యతో ఏటా రూ.8 కోట్లు ఆదా కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక నుంచి ఈ క్యాంటీన్ ను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించనుందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. ఇంతకాలం నార్తన్ రైల్వే దాని నిర్వహణ బాధ్యతలు చూసింది.





