
ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులు, రోహింగ్యా ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 ప్రయోజనాలు పొందేందుకు క్రైస్తవంలోకి మారేందుకు సిద్ధపడుతున్నట్లు నిఘావర్గాలు కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశాయి. ‘‘పొరుగున ఉన్న మూడు దేశాల్లోని క్రైస్తవులు భారతీయ పౌరసత్వం పొందేందుకు అర్హులైన నాటి నుంచి అఫ్గానిస్థాన్ శరణార్థులు, రోహింగ్యాల్లో ఓ వర్గం వారు క్రైస్తవంలోకి మారిపోయి భారతీయ పౌరసత్వం పొందాలని భావిస్తున్నారు’’ అని అందులో పేర్కొన్నాయి. ఈ మేరకు 25 ఉదంతాలను సైతం నిఘావర్గాలు అందజేశాయి. 2019లో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 ఈ ఏడాది జనవరి పదో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లోని ముస్లిమేతర వలసదారులు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైన్లు, క్రైస్తవులు) భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, దిల్లీలోని స్థిరపడిన అఫ్గాన్ శరణార్థుల్లో కొందరు చాన్నాళ్ల నుంచి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ‘‘దిల్లీలోనే ఎక్కువగా ఉండే అఫ్గానిస్థాన్ ముస్లిం శరణార్థుల్లో గతేడాది పార్లమెంటు సీఏఏ ఆమోదించిన అనంతరం అనిశ్చితి ఎక్కువైంది. తమను భారత్ నుంచి పంపివేస్తారేమోనని భయపడుతున్నారు. చాలామంది అఫ్గాన్ ముస్లింలు క్రైస్తవ మతం స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్నారు’’ అని దిల్లీలోని అఫ్గాన్ చర్చి అధిపతి ఆడిబ్ మ్యాక్స్‌వెల్ చెప్పారు.
* ఒక అంచనా ప్రకారం దిల్లీలో సుమారు 1.55 లక్షల మంది ఆఫ్గనిస్థాన్ శరణార్థులు నివశిస్తున్నారు. వీరిలో 80 నుంచి 100 మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. మరికొందరు మతం మారేందుకు సిద్ధంగా ఉన్నారు.
* మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌కు చెంది రోహింగ్యా ముస్లింలు 40,000 మంది భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వారిలో చాలా మంది సీఏఏ-2019 ప్రయోజనాలు పొందేందుకు క్రైస్తవ మతంలోకి మారేందుకు ఆసక్తిగా ఉన్నారు.





