ArticlesNews

ఖిలాఫత్ ఉద్యమం: ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?

124views

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఒట్టమన్ సామ్రాజ్య విచ్ఛిన్నం, టర్కీ ఖలిఫత్ రద్దు తరువాత భారతీయ ముస్లింలలో వచ్చిన మార్పును ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) సూచిస్తుంది. ఖలీఫాను(ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి మత నాయకుడు)  తిరిగి నియమించుకోవడమే ఈ ఉద్యమపు ప్రధాన లక్ష్యం. ఖిలాఫత్ ఉద్యమం జరిగి వందేళ్లు అయినా ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. అది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఆ ఉద్యమం వెనుక అనేక చారిత్రక పరిణామాలు, మతపరమైన ఆలోచనలు ఉన్నాయి. దాని వల్ల మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం ప్రభావితమయ్యింది. అది దేశ విభజనకు ఒక కారణమయ్యింది.

ఖిలాఫత్సహాయనిరాకరణోద్యమం

చాలమందికి ఖిలాఫత్ ఉద్యమానికి, సహాయనిరాకరణోద్యమానికి మధ్య సంబంధం పెద్దగా తెలియదు. `21 మార్చ్ 1919 బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టం, 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా గాంధీజీ 1920 సెప్టెంబర్ 4న సహాయనిరాకరణోద్యమం ప్రారంభించారు’ అని మనం తరతరాలుగా చదువుకుంటున్నాము. ప్రస్తుతం మన విద్యావంతులందరికి `జ్ఞానప్రదాత’ అయిన వికీపీడియాలో ఇలాగే ఉంటుంది.

చరిత్రకారులుగా చెలామణి అయిన పార్టీ సిద్ధాంతకర్తలు `దేశంలో అతి పెద్ద మతవార్గాలైన హిందువులు, ముస్లిములు కలిసి ఖిలాఫత్ తో పాటు సహాయనిరాకరణోద్యమం చేస్తే ఈ దేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుందని గాంధీజీ భావించారు. ఆ రెండు ఉద్యమాలు నిజంగానే బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనపై ఎంతో ప్రభావం చూపాయి’(Themes in Indian History part III, Textbook of History for class XII, published by NCERT, p. 350) అంటూ బాగా నూరిపోశారు. కాంగ్రెస్ అధికారిక చరిత్రలో(పట్టాభి సీతారామయ్య వ్రాసిన హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సి డబ్ల్యూ సి, మద్రాస్, 1935, పేజీ. 334, 335) కూడా సహాయనిరాకరణోద్యమాన్ని `స్వరాజ్య’ సాధన కోసం కాంగ్రెస్ ప్రారంభించింది’ అని వ్రాసారు. ఇది చరిత్రను తలక్రిందులు చేయడమే.

ఖిలాఫత్ ఉద్యమం గురించి నిజాలు విపరీతమైన అబద్ధపు ప్రచారంలో కూరుకుపోయాయి. రాజకీయ, సైద్ధాంతిక ప్రయోజానాల కోసం కొందరు ఆ పని చేస్తూ ఉంటారు.

రాజకీయ చర్చ

కాంగ్రెస్ అధికారిక వెబ్ సైట్ లో 2018 అక్టోబర్ 28న ఖిలాఫత్ గురించి ఒక వ్యాసం ప్రచురితమయింది. ఆ వ్యాసంలో ఇలా పేర్కొన్నారు – ‘’బ్రిటిష్ పాలన నుండి విముక్తం కావడానికి భారత్ చేసిన చెప్పుకోదగిన ప్రయత్నాలలో ఖిలాఫత్ ఉద్యమం ఒకటి…బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో హిందువులు, ముస్లింలు కలిసి చేసిన పోరాటం అది…సహాయ నిరాకరణ ఉద్యమంతోపాటు ఖిలాఫత్ ఉద్యమాన్ని కలిపి ముందుకు తీసుకువెళ్లాలన్న గాంధీజీ నిర్ణయం సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వాణిని మరింత గట్టిగా వినిపించడానికి అవకాశం కల్పించింది… శోషణకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలను కలపడానికి, వారివారి ప్రయోజనాలను సాధించడానికి ఇది సదవకాశమని ఆయన గ్రహించారు…`స్వరాజ్’ అనే స్వీయ పరిపాలన ప్రతిపాదనను ఖిలాఫత్ లక్ష్యాలతో ముడిపెట్టడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలను ఒకేసారి సాధించాలనుకున్నారు…భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందూ, ముస్లిం ఐక్యతకు సంబంధించిన అపూర్వమైన ఉదాహరణ ఖిలాఫత్ ఉద్యమంలో కనిపిస్తుంది…భారత జాతీయ కాంగ్రెస్ నేతలు, ఖిలాఫత్ నాయకులు భుజంభుజం కలిపి పనిచేసినందువల్ల ఇది సాధ్యపడింది…హిందువులు, ముస్లిములు కలిసి పోరాడితేనే బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందగలరనే గాంధీజీ ప్రగాఢ విశ్వాసానికి ఆనాటి పరిస్థితులు ప్రత్యక్ష నిదర్శనం’’ (https://www.inc.in/en/in-focus/the-khilafat-movement-a-landmark-movement-in-indias-journey-to-freedom).

విద్యా సంబంధ చర్చ

కొందరు చరిత్రకారులు తమతమ ప్రయోజనాల కోసం అనేక అపోహలు, భ్రమలు ప్రచారం చేశారు. స్కాటిష్ చరిత్రకారుడు హామిల్టన్ గిబ్ (1895 – 1971) ఖిలాఫత్ ఉద్యమం పెరుగుతున్న హిందూ జాతీయవాదంపై వచ్చిన ప్రతిక్రియ అన్నాడు. “ప్రపంచం మొత్తంలో ముస్లిములు ఉన్నా, భారత దేశంలోని ముస్లిములు మాత్రమే ఇస్లాం యొక్క అంతర్జాతీయ హోదా గురించి మాట్లాడారు. నిజానికి హిందూ జాతీయవాదాన్ని ఎదుర్కొనడం కోసమే వాళ్ళు అలా మాట్లాడారు’’ అంటూ గిబ్ వ్రాశాడు. (Whither Islam? A survey of the modern movement in the Moslem world, 1932,Routledge, p 73). కొన్నిసార్లు చరిత్రకారుల వ్రాతలు హాస్యాస్పదంగా ఉండేవి. కెనడాకు చెందిన ముస్లిం చరిత్రకారుడు విల్ఫ్రెడ్ కాంట్ వెల్ స్మిత్ తన Modern Islam in India: A Social Analysis(Minerva Book Shop, Lahore) అనే పుస్తకంలో ఇలా వ్రాశాడు – “ఖిలాఫత్ అనే మాటకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక విచిత్రమైన అర్ధం ఉంది. అది వ్యతిరేకత అనే అర్ధం కలిగిన `ఖిలాఫ్’ అనే ఉర్దు పదం నుంచి వచ్చిందని భావించేవారు. కాబట్టి ఖిలాఫత్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా వాళ్ళు అనుకునేవారు. వాళ్ళకి ఇస్లాం తెలుసు. కానీ మహమ్మద్, ఒట్టమన్ సామ్రాజ్యం గురించి తెలియదు.’’ డి.జి. టెండూల్కర్ కూడా తన Mahatma: Life of Mohandas Karamchand Gandhi (vol2, p 47) లో ఇవే అసంబద్ద, హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు.  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రచురించిన, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ఆవిష్కరించిన భారత జాతీయ కాంగ్రెస్ శతవార్షిక చరిత్ర (Academic Foundation, Delhi, 1985, Vol.2, p. 66)లో ఇలాంటి విషయాలే కనిపిస్తాయి. అయితే ఇలాంటి అసంబద్ధ విషయాలు ఉన్న ఈ సంపుటి సంపాదకులు ప్రముఖ నెహ్రూ మార్కు సెక్యులర్ వాదులైన రవీంద్ర కుమార్, బి ఎన్ పాండే అంటే మనకు ఏమి ఆశ్చర్యం కలగదు.

ఖిలాఫత్ ఉద్యమం భారత్ లో ఇస్లాం వ్యాప్తికి సంబంధించిందేకానీ ప్రపంచమొత్తం ఇస్లాం వ్యాప్తి గురించి కాదని కొందరు మేధావులు కొత్తవాదనలు లేవదీశారు. (ది ఖిలాఫత్ మూమెంట్: రిలిజియస్ సింబాలిజం అండ్ పోలిటికల్ మొబిలైజేషన్ ఇన్ ఇండియా, గైల్ మినాల్ట్, కొలంబియా యూనివర్సిటీ ప్రెస్, 1982). మరొక `ప్రముఖ చరిత్రకారుడు’ ప్రొఫెసర్ భోజనందన్ ప్రసాద్ సింగ్ అయితే ఖిలాఫత్ ఉద్యమంలో సెక్యులరిజాన్ని చూపించాలని ప్రయత్నించాడు. (ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, సంపుటి.63, పుట; 615-621). “ఆ ఉద్యమానికి సంబంధించి కావాలని మత విషయాలను ప్రచారం చేసి అందులోని సెక్యులర్ అంశాలు బయటపడకుండా చేశారు. చివరికి ఆ ఉద్యమం గురించి అధికారిక వ్రాతల్లో కూడా లేకుండా చేశారు..’’అంటూ ఆయన ఆరోపించాడు. ఈ ధోరణిని రఫిక్ జకారియా తన వ్యాసం `ట్రూత్ అబౌట్ ద ఖిలాఫత్ మూమెంట్’(హిందూస్తాన్ టైమ్స్, న్యూఢిల్లీ, 24, ఆగస్ట్, 1997)లో ప్రశ్నించారని ప్రసాద్ సింగ్ పేర్కొన్నాడు. సెక్యులర్ జాతీయవాదాన్ని పెంపొందించడానికి గాంధీగారు అనుసరించిన వ్యూహంలో ఖిలాఫత్ ఉద్యమం ఒక భాగమని ఆ `ప్రముఖ చరిత్రకారుడు’ సూత్రీకరించాడు. అంతేకాదు ఇంకా చాలా `అద్భుత’ విషయాలు చెప్పాడు. “స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భారతాన్ని వివిధ మతాలకు చెందినవారంతా సోదరభావంతో కలిసిమెలసి జీవించే విధంగా రూపొందించడం కోసం గాంధీజీ సహాయనిరాకరణ, ఖిలాఫత్ వంటి సెక్యులర్ జాతీయవాద ఉద్యమాలను ప్రారంభించారు…సహాయనిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాల్లో అహింస ప్రధాన సూత్రం….’’

చరిత్రను నిరాకరించడం

ఖిలాఫత్ ఉద్యమానికి ఎలాంటి మతపరమైన, చరిత్రపరమైన నేపధ్యం లేదని, అది హఠాత్తుగా ప్రారంభమైపోయిందని కొందరు వాదిస్తారు. ఆ ఉద్యమపు హిందూవ్యెతిరేక ధోరణిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. గార్గి చక్రవర్తి “పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముస్లింలను సమైక్యపరచాలనే ఇస్లాంను వ్యాప్తిచేయాలనే సిద్ధాంతం 1911లో ఇటలీ, టర్కీల మధ్య యుద్ధం ప్రారంభమయ్యేవరకు భారత్ లో కనిపించలేదు. ఇటలితో బ్రిటన్ రహస్య ఒప్పందం చేసుకుంది. దీనితో భారతీయ ముస్లిములు బ్రిటన్ కు దూరమైపోయారు. తమ ఇస్లాం సంస్కృతిని నాశనం చేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదం చూస్తోందని వారికి అనిపించింది. `ఇస్లాం ప్రమాదంలో ఉంది’ అనే నినాదం క్రైస్తవ మతం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పుట్టిన పిడివాద ద్వేషం నుంచి వచ్చినదే తప్ప అది హిందువులకు వ్యతిరేకం కాదు’’(mainstream, సంపుటి: LVIII నెం. 6, న్యూఢిల్లీ, 25 జనవరి, 2020). చక్రవర్తి వ్రాసిన ఈ వ్యాసం నిజానికి `Globalisation and Religious Diversity : issues, perspectives and the Relevance of Gandhian Philosophy’ అనే పేరుతో ఇంటర్నేషనల్ వింటర్ స్కూల్ లో జరిగిన సెమినార్ లో సమర్పించిన పత్రం. 2020 జనవరి 8 నుండి 14 వరకు ఢిల్లీ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, డెన్మార్క్ కు చెందిన ఆర్హస్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సెమినార్ నిర్వహించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచ ఇస్లామీకరణ (పాన్ ఇస్లామిజం)ను పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి ప్రతిస్పందనగా, ప్రతీకారంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.

సెక్యులరిస్ట్ లుగా పేరుపడినవారి సంగతి ఇలా ఉంటే ఎలాంటి మొహమాటం, సంకోచం లేని ఇస్లాం వాదుల వాదన ఎలాఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. ట్రినడాడ్ టొబాగో ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సర్వీస్ ఆఫీసర్ గా పనిచేసిన షేక్ ఇమ్రాన్ హోసైన్ 1985లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇస్లాం ఉద్యమాన్ని చేపట్టాడు. అతను ఖిలాఫత్ ఉద్యమం గురించి ఇలా వ్రాశాడు -“కత్తి చూపి బెదిరించి బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు యూరోప్ రాజకీయ సెక్యులరిజాన్ని ఇస్లాంకు ప్రత్యామ్నాయంగా రుద్దాలని చూశారు. హిందువులు, ముస్లిములు ఈ కొత్త యూరోప్ మతమైన `సెక్యులరిజాన్ని’ తిరస్కరించారు, సవాలు చేశారు. తమదైన రాజకీయ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు సిద్ధపడ్డారు….శ్వేతేతర ప్రపంచంపై సామ్రాజ్యవాద పాశ్చాత్య దేశాలు బలవంతంగా రుద్దాలనుకున్న యూరోపియన్ రాజకీయ సెక్యులరిజం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని ఖిలాఫత్ ఉద్యమం తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి సమయంలో టర్కీలో కొత్తగా ఏర్పడిన ముస్తఫా కమల్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రభుత్వం సహాయంతో ఖలీఫత్ ను రద్దుచేసి, అపూర్వమైన, హిందూ, ముస్లిం ఐక్యతతో సాగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని అణచివేయాలని బ్రిటిష్ పాలకులు అనుకున్నారు.’’(The Return of the Khilafat). ఖిలాఫత్ ను స్థానిక సంస్కృతిని పరిరక్షించే, జాతి దురహంకారాన్ని వ్యతిరేకించిన ఉద్యమంగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నమే జరుగుతోందని ఈ వ్రాతలను బట్టి మనకు తెలుస్తుంది.

గతం నుంచి వర్తమానం దాకా

ఖిలాఫత్ ఉద్యమం వంటిదే మరొకటి ఈ దేశంలో తమకు కావలసిన రాజకీయ మార్పు తెస్తుందని చరిత్రకారులుగా చెలామణి అవుతున్న కొందరు `మేధావులు’ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రిన్ స్టాన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించే జ్ఞాన్ ప్రకాష్ వంటివారు ఏకంగా ఖిలాఫత్ ఉద్యమానికి, ఇటీవల దేశంలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలకు పోలిక ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు కూడా. “భారత్ లో తమ స్థానాన్ని గురించి ఆర్ ఎస్ ఎస్ ప్రేరిత దుష్ప్రచారాన్ని ఎదుర్కునేందుకు ముస్లింలు గట్టిగా నిలబడ్డారు. తాము కేవలం ముస్లింలు మాత్రమే కాదని, భారతీయులు కూడా అని వాళ్ళు స్పష్టం చేశారు. ముస్లింలలో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీజీ ఖిలాఫత్ ను ఉపయోగించారు. అందులో కూడా భారతీయతతో పాటు ముస్లిం అస్తిత్వం కూడా ఉంది. ‘’(why the protests remind us of Gandhi`s Khilafat movement , Economic Times, 12 Jan , 2020)

ఖిలాఫత్ ఉద్యమం గురించి కొత్త భాష్యాలు చెపుతున్నవారు ఏమంటారంటే – “సామ్రాజ్యవాద పాలకుల బాధలు తట్టుకోలేని ఒక వర్గం, ముస్లిమేతర సోదరులతో కలిసి మహాత్మాగాంధి నాయకత్వంలో ప్రారంభించిన ఉద్యమం.’’ ఇక్కడ `సామ్రాజ్యవాద పాలకులు’ అనే మాటను `హిందూ ఆధిక్యత’ తోనూ, `ముస్లిమేతర సోదరులు’ అనే మాటను `ఎక్కువతక్కువలున్న హిందూ వ్యవస్థలో అణచివేతకు గురైన వారు’ అని సవరించి చూసుకోండి ఇప్పుడు సాగుతున్న `ఉద్యమాల’ రహస్యం బయటపడుతుంది.

ఖిలాఫత్ ఉద్యమానికి `తెల్ల రంగు’ వేయాలనుకుంటున్నవారి  ప్రయత్నాలను వమ్ముచేయాలి. ఎందుకంటే ఖిలాఫత్ కు కారణమైన 100 ఏళ్లనాటి ధోరణే నేటికీ పనిచేస్తోంది, కనిపిస్తోంది. ఈ మనస్తత్వం, ధోరణే దేశంలో ఏడవ శతాబ్దపు మతవాతావరణాన్ని మళ్ళీ సృష్టించాలని చూస్తోంది. చరిత్రను ఎవరు మరచిపోతారో వారు ఆ చారిత్రక తప్పిదాలను మళ్ళీ చేసి నష్టపోతారు. అలాగే చరిత్రను మాసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నవారు కూడా మిగలరు. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి.

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.