News

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు BJP నాయకుల హత్య

940views

కేంద్రపాలిత ప్రాంతంలోని బండిపూర్ జిల్లాలో బుధవారం రాత్రి షేక్ వసీం బారి, అతని తండ్రి, సోదరుడు ఉగ్రవాదుల హత్యకు గురయ్యారు. ముగ్గురూ బిజెపి నాయకులు.

బుధవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ బిజెపి నాయకుడు షేక్ వసీం బారి మరియు అతని ఇద్దరు కుటుంబ సభ్యులను హత్య జరిగిన తరువాత, ఆ కుటుంబ రక్షణకై నియమింపబడిన 10 మంది పోలీసులను అరెస్టు చేశారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. “ఉగ్రవాదులను గుర్తించాం” అని కూడా జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ పోలీస్ దిల్బాగ్ సింగ్ చెప్పారు.

“ది రెసిస్టెన్స్ ఫ్రంట్” అని పిలిచే ఒక కొత్త టెర్రర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇది జైష్, లష్కర్-ఎ-తైబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ల అనుబంధ సంస్థ అని పోలీసులు చెబుతున్నారు.

జమ్మూ కాశ్మీర్లోని బందిపూర్ జిల్లాలో షేక్ వసీం బారి, అతని తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ లు వారి ఇంటి వద్దే హత్యకు గురయ్యారు. ముగ్గురూ బిజెపి సభ్యులు. వారి వద్ద వ్యక్తిగత భద్రతా అధికారులు ఉన్నారు. కానీ ఉగ్రవాద దాడి జరిగినప్పుడు వారు సంఘటనా స్థలంలో లేరు.

8 వ తేది రాత్రి 8.30 గంటల సమయంలో వసీం బారి మరియు అతని కుటుంబం వారి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది.

సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో, బైక్‌పై వచ్చిన ఒక ఉగ్రవాది దగ్గరి నుంచే కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. హతుల ఇల్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు 10 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. ఈ ఘటనలో తండ్రి, ఆయన ఇద్దరు కుమారులు కాల్చి చంపబడ్డారు. సైలెన్సర్‌ అమర్చిన రివాల్వర్‌ను ఉగ్రవాది ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై ఉగ్రవాది దాడి చేసిన సమయంలో వారి భద్రతా సిబ్బంది ఆ ఇంటి మొదటి అంతస్తులో ఉన్నారు.

“తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం, ప్రాణాలను రక్షించడంలో విఫలమైనందుకు మేము వారిపై కఠినమైన (స్టాండ్) తీసుకుంటున్నాము” అని కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ అన్నారు. ” సిసిటివి ఫుటేజ్ ప్రకారం ముందస్తు వ్యూహంతోనే దాడి చేసినట్లు అనిపించింది. ముగ్గురి తలపై అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. మేము ఉగ్రవాదులను గుర్తించాము. వారిలో ఒకరు లష్కర్-ఎ-తోయిబాకు చెందినవారు. ఈ బృందంలో మరొకరు పాకిస్తానీ. పోలీసులు, సైన్యం మరియు సిఆర్పిఎఫ్ ల సంయుక్త ఆపరేషన్ తో ఉగ్రవాదులను త్వరలోనే మట్టుబెడతాము” అని కుమార్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.