News

‘జానీ జానీ ఎస్ పాపా’ వంటి ఆంగ్ల కవితలు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తున్నాయి! : యోగేంద్ర ఉపాధ్యాయ్

5views

పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో రూపొందిన కొన్ని ఆంగ్ల బాలపద్యాలు చిన్నారులలో భారతీయ సంస్కారాలు, నైతిక విలువలు పెంపొందించడంలో విఫలమవుతున్నాయని ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. కాన్పూర్‌లో జరిగిన ఒక విద్యా కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన, ‘జానీ జానీ యెస్ పాపా’ వంటి ప్రసిద్ధ ఆంగ్ల పద్యాలు పిల్లలకు చిన్న వయస్సు నుంచే అసత్యం చెప్పే అలవాటు కలిగించే అవకాశముందని పేర్కొన్నారు.

మంత్రి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయులు కేవలం పాఠ్యబోధకులుగానే కాకుండా, ‘గురువుల’ పాత్రను పోషించాలి. విద్యతో పాటు సద్గుణాలు, సంస్కారాలు, సత్యనిష్ఠ వంటి జీవన విలువలను కూడా పిల్లలకు అందించాలి” అని అన్నారు. “‘జానీ జానీ యెస్ పాపా’ పద్యంలో వచ్చే ‘నో పాపా’ అనే పదాలు పిల్లలకు తప్పు చేసిన తరువాత దాన్ని దాచిపెట్టడం లేదా అబద్ధం చెప్పడం సహజమనే భావన కలిగించవచ్చు” అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా, భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, సత్యం, విధేయత వంటి ఆదర్శాలను ప్రతిబింబించే హిందీ మరియు  ఇతర  భారతీయ భాషల బాలపద్యాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. “భారతీయ సంస్కృతి ఆధారిత విద్యా విధానం ద్వారానే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.