News

శ్రీలంక దినపత్రికల్లో ‘ఆపరేషన్ సిందూర్‌’పై పూర్తి పేజీ ప్రకటనలు

24views

భారత సైన్యం గతేడాది నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్‌’కు, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళి అర్పిస్తూ శ్రీలంకలో  ప్రముఖ దినపత్రికలు పూర్తి పేజీ ప్రకటనలను ప్రచురించాయి. కొలంబోలోని ఇంగ్లీష్, సింహళ, తమిళ పత్రికల్లో ఈ యాడ్స్ కనిపించాయి. కొలంబోలోని భారతీయ సమాజం ఆధ్వర్యంలో ఈ ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలకు సంబంధించిన చిత్రాలను శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

2025 ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం 2025 మే 7న ‘ఆపరేషన్ సిందూర్‌’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తోయిబా సహా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు చేసింది. ఉగ్రవాదంపై ఏమాత్రం సహనం చూపబోమన్న (జీరో టాలరెన్స్) భారత్ విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటింది.

ఈ ఆపరేషన్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీలంకలోని భారతీయులు ఈ ప్రకటనలు ఇచ్చారు. “పహల్గామ్‌లో చిందిన అమాయకుల రక్తాన్ని మరువొద్దు. న్యాయం చేసిన మన వీరులకు నీరాజనాలు. ఉగ్రవాదం ముసుగులో దాక్కున్న పిరికిపందలకు ఇదో గుణపాఠం” అనే సందేశంతో ‘వీకెండ్ మిర్రర్’ పత్రికలో ఒక ప్రకటన ప్రచురితమైంది. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు.

పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మతాన్ని అడిగి, ‘కలిమా’ చదవమని బలవంతం చేసి మరీ హిందూ యాత్రికులను గుర్తించి కాల్చిచంపారు. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, వారిని కాపాడబోయిన ఒక స్థానికుడు మరణించారు. ఈ క్రూరమైన దాడికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత తీసుకుంది. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసే దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగంగానే శ్రీలంకలో ఈ ప్రకటనలు వెలువడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.