
ఈ సంవత్సరారంభంలో నేను సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనేందుకు వెళ్లాను. సోమ్‌నాథ్ ఆలయంపై మొదటి దండయాత్ర జరిగి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నేను మళ్లీ ఈనెల 11న సోమ్‌నాథ్ సందర్శించబోతున్నాను. ఆలయ విధ్వంసం, దాని పునరుద్ధరణలను సంస్మరించుకునేందుకు ఉద్దేశించిన రెండు కార్యక్రమాల్లో ·కేవలం ఆరునెలల వ్యవధిలో పాల్గొనగలగడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.
సోమ్‌నాథ్ అందిస్తున్న సందేశం మన నాగరికతకు సంబంధించినది. ఆలయానికి అభిముఖంగా ఉన్న సముద్రం సమయాతీత తత్వాన్ని బోధిస్తోంది. ఎంత తీవ్రమైన ఆటుపోట్లు, తుపానులు సంభవించినా వాటి నుంచి మరింత బలీయంగా, గౌరవప్రదంగా పైకి లేవచ్చని అక్కడి అలలు మనకు చెబుతాయి. అవి మళ్లీ మళ్లీ తీరానికి చేరుతూ ప్రజా చైతన్యాన్ని ఎక్కువ కాలం తొక్కిపెట్టలేమన్న సందేశాన్నిస్తాయి. దివ్య ప్రభాస ప్రదక్షిణ (సోమనాథ్) యావత్ ప్రపంచ ప్రదక్షిణతో సమానమని మన పురాతన శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. దండయాత్రలు, కల్లోలాలతో చరిత్ర ముందుకు సాగిపోయింది. సామ్రాజ్యాలు ఉత్థాన పతనాలకు గురయ్యాయి. కానీ సోమ్‌నాథ్ మాత్రం మనకు నిరంతర చైతన్యాన్ని అందిస్తూనే ఉంది.
లకులీశ, సోమశర్మల నుంచి అహల్యాబాయి హోల్కర్ వరకు అసంఖ్యాక మహనీయుల్ని స్మరించుకునే సమయం ఇది. ఆ మహారాణి అత్యంత క్లిష్ట సమయంలోనూ ఆలయంలో ప్రార్థనలు కొనసాగేలా చూశారు. ప్రస్తుతం ఆమె త్రిశతాబ్ది జయంత్యుత్సవాలు కూడా జరుగుతున్నాయి. బరోడాకు చెందిన గైక్వాడ్ రాజులు ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికుల హక్కుల్ని కాపాడారు. వీర హమీర్‌జీ గోహిల్, వీర వెగ్దాజీ భిల్లులు చేసిన త్యాగం, చూపిన ధైర్యస్థైర్యాలు సోమ్‌నాథ్ ఎన్నటికీ మరువలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. 1947, నవంబరు 13న, దేశం యావత్తూ దీపావళి పర్వదినాన్ని జరుపుకొంటున్న సమయంలో సర్దార్ పటేల్ అప్పటికి శిథిలావస్థలో ఉన్న సోమ్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సకల్పంచెప్పారు. ఆయన పిలుపునకు యావత్ భారత ప్రజానీకం ఉత్సాహంగా స్పందించారు. ఆలయం తలుపులు తిరిగి తెరుచుకునేనాటికి ఆయన ఈ లోకంలో లేకున్నా, చేసిన కృషి ఫలితం శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన కల సాకారమవడానికి కే.ఎం. మున్షీ ఎంతో కృషి చేశారు. నవానగర్‌కు చెందిన జామ్‌సాహెబ్ సహకారం అందించారు. 1951లో ఆలయ పునర్నిర్మాణం పూర్తైనప్పుడు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభ్యంతరాలను అధిగమించి డాక్టర్ ప్రసాద్ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేయడం ఆ ఘడియను మరింత ప్రత్యేకంగా మార్చింది..
2001 అక్టోబరులో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లు నాకు స్ఫురణకు వస్తున్నాయి. 2001, అక్టోబరు 31న సర్దార్ పటేల్ జయంతినాడు గుజరాత్ ప్రభుత్వం సోమ్‌నాథ్ ఆలయ పునరారంభ 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. యాదృచ్ఛికంగా సర్దార్ పటేల్ 125వ జయంత్యుత్సవాలూ అప్పుడే జరిగాయి. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, కేంద్ర హోమ్ మంత్రి ఎల్.కె. ఆడ్వాణీలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూర్తీభవించిన అచంచల విశ్వాసాన్ని, ప్రేమను ఎవ్వరూ ధ్వంసం చేయలేరని సోమ్‌నాథ్ ఆలయం చాటుతోంది. ‘‘వికాస్ భీ, విరాసత్ భీ’’ (అభివృద్ధి, వారసత్వం కూడా) అన్న నినాదానికి అనుగుణంగా నా యంత్రాంగం సోమ్‌నాథ్ నుంచి కాశీ వరకూ, కామాఖ్య నుంచి కేదార్‌నాథ్ వరకూ, అయోధ్య నుంచి ఉజ్జయిని వరకూ, త్రయంబకేశ్వర్ నుంచి శ్రీశైలం వరకూ ఆధ్యాత్మిక క్షేత్రాలన్నిటిలో సంప్రదాయాలను పరిరక్షిస్తూనే అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తోంది. దీంతో పాటు ఆ క్షేత్రాలకు రవాణా సదుపాయాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలు వాటి దర్శనానికి విచ్చేసే ఏర్పాటు చేశాం. ఇది స్థానిక ఆర్థికానికి ఊతమందించడంతోపాటు బతుకు తెరువు మార్గాలను బలోపేతం చేస్తుంది. తద్వారా ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ అనే భావన మరింత బలపడుతోంది. ఈ అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ప్రతి భారతీయుని మదిలోని నాగరికతా చైతన్యం, ఐక్యతా భావనల కారణంగా సోమ్‌నాథ్ సమున్నతంగా నిలబడుతోంది. ఈ స్ఫూర్తికి నివాళిగా, వేయి సంవత్సరాల అసాధారణ ధైర్యానికి గుర్తుగా రానున్న వేయి రోజులూ సోమ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ పూజల కోసం ఎందరో భక్తులు ఘనంగా విరాళాలు అందించడం నాకు ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక సమయంలో సోమ్‌నాథ్‌ను దర్శించాలని నా తోటి భారతీయుల్ని ఆహ్వానిస్తున్నాను. సోమ్‌నాథ్ తీరంలో మీరు నిలబడినప్పుడు ఎన్నటికీ చెరిగిపోని నాగరికతా విలువలను మీరు అవలోకిస్తారు. సోమ్‌నాథ్ సందర్శనతో మీరు అజేయమైన భారత స్ఫూర్తిని అనుభూతి చెందుతారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మన సంస్కృతి ఓటమి లేకుండా ఎందుకు నిలబడిందో మీకు బోధపడుతుంది. ఓటమెరుగని శాశ్వత విజయాన్ని దర్శించే అవకాశం మీకు లభిస్తుంది. అది మరువరాని అనుభూతిగా మిగిలిపోతుంది.
జై సోమ్‌నాథ్
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి





