News

ప్రతి మతాచారాన్నీ ప్రశ్నిస్తే నాగరికత ఉనికికే ప్రమాదం : సుప్రీంకోర్టు

6views

ప్రతి ఒక్కరూ మతాచారాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటే మత విశ్వాసాలతో మమేకమైన నాగరికత కలిగిన భారతీయ సమాజం పరిస్థితి ఏమిటని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న ప్రశ్నించారు. ఆలయం తెరిస్తే తప్పని కొందరు, మూసివేస్తే తప్పని మరికొందరు… ఇలా ప్రతి చిన్న విషయంపైనా వందల కొద్ది పిటిషన్లు న్యాయస్థానాలను ముంచెత్తుతాయని హెచ్చరించారు.

దేశంలోని ప్రార్థనా స్థలాలతో పాటు శబరిమల అయప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై వివక్షను ప్రశ్నిస్తూ దాఖైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ పదమూడవ రోజుకు చేరుకుంది.

భిన్నత్వానికి, వైవిధ్యానికి నెలవైన మన దేశంలో మతాచారాలను ప్రశ్నిస్తూ వెళ్తే ప్రతి మతమూ చిక్కుల్లో పడుతుందని, న్యాయస్థానాలనూ మూసివేయాల్సి వస్తుందని జస్టిస్‌ సుందరేశ్‌ పేర్కొన్నారు. ఎన్ని వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకే నాగరికతను కలిగి ఉన్నామని జస్టిస్‌ నాగరత్న తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలమన్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులకు మతంతో ఉన్న సంబంధం మన సమాజంలో స్థిరమైన అంశాల్లో ఒకటని వివరించారు. దావూదీ బోహ్రా సమాజంలోని బహిష్కారం, మహిళల జననాంగాల విచ్ఛేదం తదితర ఆచారాలు విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.