
శ్రీశైలం దేవస్థానంలో మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
సోమనాథ ఆలయంపై విదేశీ దాడి జరిగి 1000 సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా “సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీశైల దేవస్థానంలో కూడా ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం కలశయాత్ర
మే 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి గంగాధర మండపం వద్ద కలశయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, అక్కడి నుంచి మల్లికార్జున సదన్ మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగి, తిరిగి గంగాధర మండపానికి చేరుకుంటుంది.
పంచాక్షరీ మంత్రలేఖనం
కలశయాత్ర అనంతరం భక్తులకు పంచాక్షరీ మంత్రలేఖనం కోసం ప్రత్యేక పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సాయంత్రం భక్తి కార్యక్రమాలు
సాయంత్రం 5.30 గంటల నుంచి గంగాధర మండపం వద్ద శివభజనలు, భక్తిరంజని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఓంకార మహిమపై ధార్మిక ప్రవచనం, తరువాత ఓంకార మంత్రజపం నిర్వహించబడుతుంది.
పేరిణి శివతాండవం ప్రత్యేక ఆకర్షణ
కార్యక్రమాల ముగింపులో రాత్రి 7.30 గంటల నుంచి పేరిణి శివతాండవ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి చేశారు.





