
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల మధ్య ఉన్న అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు విమర్శలు చేయడంతో, ఆయన శివపార్వతుల విగ్రహ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై అస్సాం ముఖ్యమంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. దేవుడి ముందు భక్తితో తలవంచాల్సింది పోయి, మనుషులను దేవతలతో పోల్చుకోవడం అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
ఇటీవల సోనియా గాంధీ రచించిన ‘Belonging: A Journey of Love’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. భోజనం చేసే సమయంలో తన తల్లి సోనియా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని, చిన్నతనంలో అది సాధారణ విషయంగానే భావించేవాడినని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు విమర్శలు గుప్పించారు.
దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ కర్ణాటకలోని 12వ శతాబ్దానికి చెందిన హలెబిడు హోయసలేశ్వర ఆలయంలోని శివపార్వతుల శిల్పం చిత్రాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. భాజపా, ఆరెస్సెస్ మద్దతుదారుల హృదయాల్లో భయం, కోపం, ద్వేషం ఒక వలలా అల్లుకుపోయాయని, అవి ప్రేమను వ్యక్తపరచకుండా అడ్డుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
‘నిజమైన హిందువుగా వారిని ఆ వల నుంచి బయటపడేయడం నా బాధ్యత. తద్వారా వారు కూడా ప్రేమ, అనుబంధంలోని అందాన్ని ఆస్వాదించగలరు. సత్యం.. శివం.. సుందరం’ అంటూ పోస్టు చేశారు.
రాహుల్ గాంధీ పోస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మనుషులను శివపార్వతులతో పోల్చుకోవడాన్ని తప్పుబట్టారు. ఏ గాంధీ కుటుంబ సభ్యుడైనా, మరే ఇతర వ్యక్తి అయినా ఎప్పటికీ దేవుడు కాలేరని స్పష్టం చేశారు.
‘మనిషి దేవుడి ముందు నిలబడాల్సింది పోయి, తానే దేవుడిగా కనిపించాలనుకున్నప్పుడు అతని పతనం ప్రారంభమవుతుంది. సాధారణ మనుషులను శివపార్వతులుగా చిత్రీకరించడం భక్తి కాదు. అది అహంకారానికి పరాకాష్ఠ. మనం భగవంతుడికి నమస్కరిస్తాం కానీ మనుషులను ఆయనతో సమానంగా భావించం. వినయం గొప్పతనానికి పునాది. అహంకారం చోటుచేసుకున్నప్పుడు పతనం మొదలైనట్లే’ అని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.





