
ప్రకృతి సంబంధిత హిందూ పండుగలు మనుగడకు పాఠ్యాంశాలు. దాదాపు ప్రతి పండుగ ప్రకృతి సందేశం కలిగి ఉంటుంది. సామాజిక బాధ్యత నుంచి వ్యక్తిగత మోక్షాన్వేషణను వేరు చేయవు. తాను పవిత్రుడిని కావాలనే సాధన, తన చుట్టూ గల సృష్టి సురక్షితంగా ఉండాలనే కర్తవ్యంతోనే పండుగ అర్థం సంపూర్ణమవుతుంది. పండుగల ద్వారా కుటుంబం సంస్కారవంతం కావాలి. గ్రామం స్వావలంబన పొందాలి. చేతివృత్తులకు గౌరవం దక్కాలి. రైతు పచ్చగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యత. పండుగల పేరుతో పర్యావరణానికి భంగం కలిగించకూడదు. సమరస సమాజమే ప్రకృతిని సమష్టిగా రక్షించగలుగుతుంది.
పండుగలు భారతీయ సమాజపు జీవంత పాఠ్యపుస్తకాలు.
ప్రకృతి వాటి పాఠ్యాంశం.
మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః(ఈ భూమి నా తల్లి; నేను ఆమె పుత్రుడను) అని అథర్వవేదం, భూమి (పృథ్వి) సూక్తం.
దేశం అంటే… పటంలో గీసిన సరిహద్దులా? ఒక జనసమూహమా? పాలనా యంత్రాంగమా? కాని, భారతీయ దృష్టిలో దేశం కేవలం భూభాగం కాదు. నదులు, పర్వతాలు, అడవులు, ప్రజలు, పశుపక్ష్యాదులు. పూర్వికుల జ్ఞానం, ఆచారాలు, పండుగలు- ఇవన్నీ కలిసి రూపొందిన సజీవ సాంస్కృతిక రాష్ట్రం. గంగను నీటి ప్రవాహంగా మాత్రమే చూడలేదు. తల్లిగా ఆరాధించాం. గోవర్ధనాన్ని రాళ్ల గుట్టగా చూడలేదు పూజనీయ పర్వతంగా గుర్తించాం. వృక్షాన్ని కలపగా మాత్రమే చూడలేదు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకగా నమస్కరించాం.
‘మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణీ!
అగ్రతః శివరూపాయ
వృక్షరాజాయ తే నమః’-వేర్లలో బ్రహ్మ స్వరూపంగా, కాండంలో విష్ణుస్వరూపంగా, అగ్రభాగంలో శివస్వరూపంగా ఉన్న వృక్షరాజా! నీకు నమస్కారం. ఇది ప్రకృతి వనరులను వినియో గించుకునే ఉపయోగించే ముందు గౌరవించడం నేర్పిన నాగరికత.
‘‘చెట్టును నరికితే శిక్ష’’ అని చట్టం, ‘‘చెట్టు దేవతా స్వరూపం’’ అని సంస్కృతి చెబుతున్నాయి. ‘‘నీటిని కలుషితం చేస్తే జరిమానా’’ అని చట్టం. ‘‘జలం తీర్థం’’ అని సంస్కృతి చెబుతుంది. ‘‘జంతువును చంపితే నేరం’’ అని చట్టం పేర్కొంటే, ‘‘ప్రతి జీవిలో దైవాంశం ఉంది’’ అని సంస్కృతి తెలుపుతోంది.చట్టం లేని సమయంలో కూడా ప్రకృతి నిలవాలంటే ప్రజల మనస్సులో సంరక్షణ భావన ఉండాలి. ఆ భావాన్ని పండుగలు తరతరాలకు మోసుకెళ్లాయి.
పర్యావరణం మనకు కొత్త పాఠం కాకపోయినా, నేడు ప్రపంచం..పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, జీవవైవిధ్యం, చక్రీయ ఆర్థిక వ్యవస్థ అంటూ చర్చిస్తోంది. ఈ ఆధునిక పదాలకు శాస్త్రీయ, విధానపరమైన ప్రత్యేకత ఉంది. అయితే, వాటి వెనుక గల మితవినియోగం, పరస్పరపోషణ, జీవకారుణ్యం, తరతరాల బాధ్యత వంటి విలువలు భారతీయ జీవనంలో చాలా కాలంగా కనిపిస్తున్నాయి. మన పూర్వికులు పర్యావరణ సంరక్షణను సంవత్సరానికి ఒకరోజు జరిగే కార్యక్రమంగా భావించలేదు. దానిని, నిత్యపూజగా, కుటుంబ సంస్కారంగా, పండుగగా, తీర్థయాత్రగా,వృక్షారాధనగా,నదీమాత పట్ల కృతజ్ఞతగా,పశుపూజగా,పంట ఉత్సవంగా.. జీవితంలో భాగం చేశారు.
భయంతో పాటించిన నియమం పర్యవేక్షణ ఉన్నంతకాలమే నిలుస్తుంది. భక్తితో స్వీకరించిన బాధ్యత తరతరాలు నిలుస్తుంది.హిందూ పండుగల్లో ప్రకృతి ఒక అలంకారం కాదు అదే ఆధారం.
పండుగలు ఆధ్యాత్మికత, కుటుంబం, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కళలు, జీవవైవిధ్యం, సామాజిక సమరసతలను కలిపిన నాగరికతా వ్యవస్థలు. అందుకే పండుగలను ‘మతపరమైన కార్యక్రమాలు’ అనే చిన్న పరిధిలో బంధించలేం. అలాగే, అన్ని పండుగలు ఆధునిక అర్థంలోని పర్యావరణ ఉద్యమాలుగానే పుట్టాయని చెప్పలేం. కానీ ప్రకృతి సంపదను గుర్తించడం గౌరవించడం పంచుకోవడం కాపాడడం అనే సామాజిక విధిని నిర్వర్తించాయి.
ధర్మమే భారతీయ సుస్థిరత…
‘‘ఈశావాస్యమిదం సర్వం
యత్కిఞ్చ జగత్యాం జగత్!
తేన త్యక్తేన భుఞ్జత
మాగృథ•ః కస్యస్విద్ధనమ్ ।।’’
‘ఈ జగత్తులోని సమస్తం పవిత్రమైనది. త్యాగభావంతో అవసరమైనంత మాత్రమే అనుభ వించు, దురాశతో ఇతరుల సంపదను ఆక్రమించకు’ అని ఈశోపనిషత్తు చెబుతోంది.దీనిలో భారతీయ సుస్థిర జీవన సూత్రం కనిపిస్తుంది.
‘ధర్మం’ అంటే మతపరమైన ఆచారం మాత్రమే కాదు. వ్యక్తి, కుటుంబం, సమాజం, జీవజాలం, ప్రకృతి మధ్య సమతుల్యతను నిలబెట్టే బాధ్యత. ప్రకృతిపై హక్కు కోరే ముందు దాని పట్ల కర్తవ్యాన్ని గుర్తించడం భారతీయ దృష్టి.
పంచభూతాలు – జాతిజీవనానికి ఆధారాలు
‘భూమిరాపోనలో వాయుః
ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతిరష్టధా’ (శ్రీమద్భగవద్గీత 7-4)
భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి తత్త్వచర్చకు మాత్రమే సంబంధించినవి కావు. జాతి ఆహారం,ఆరోగ్యం,ఆర్థిక వ్యవస్థ, సంస్కృతిని నిలబెట్టే మూలాధారాలు.
భూమి కలుషితమైతే ఆహార భద్రత నశిస్తుంది. జలం కలుషితమైతే గ్రామాలు బలహీనపడతాయి. గాలి కలుషితమైతే ఆరోగ్యం దెబ్బతింటుంది.అగ్ని, శక్తి నియంత్రణ తప్పితే వినాశనం జరుగుతుంది. ఆకాశం శబ్ద కాంతి కాలుష్యంతో నిండితే జీవుల సహజ లయ దెబ్బతింటుంది. పండుగ కాలానికి తగిన కర్తవ్యాన్ని తెలిపింది. పండుగ రోజున ఆహార పంపిణీ, జలదానం, చెరువు శుభ్రత, వృక్ష సంరక్షణ, పశుసేవ చేపట్టాలి. సేవలేని భక్తి వ్యక్తిగత అనుభూతిగా మిగులుతుంది. సేవతో కూడిన భక్తి సమాజశక్తిగా మారుతుంది.
ఉగాది – కుటుంబం నుంచి దేశం వరకు వార్షిక సంకల్పం.ఈ పండుగ వసంతంలో ప్రకృతి కొత్తగా చిగురించే కాలంలో వస్తుంది. ఇది కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు?కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మార్పు కాదు- కర్తవ్య పునరుద్ధరణ. సమాజం రాబోయే సంవత్సరానికి సిద్ధమయ్యే సందర్భం. మామిడి తోరణం, వేపపువ్వు, కాలానుగుణ పదార్థాలు ప్రకృతిని ఇంటి గుమ్మానికి తీసుకొస్తాయి. ఈ పర్వదినం నాడు ప్రతి కుటుంబం … ‘ఒక మొక్కనైనా నాటడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, కనీసం ఒక స్వదేశీ చేతివృత్తి లేదా రైతు ఉత్పత్తిని ఆదరించడం’ అనే సంకల్పాలను చెప్పుకోవాలి.
‘అక్షయ తృతీయ’లో అక్షయమైనది బంగారం కాదు, ప్రకృతి సంపద. ‘అక్షయం’ అంటే క్షయం లేనిది. దీనిని బంగారం కొనుగోలుకే పరిమితం చేస్తే పండుగ భావాన్ని చిన్నది చేసినట్లవుతుంది. నిరంతర అభివృద్ధికి ప్రేరణ.
నీటి వనరులు,విత్తన సంపద,నేల సారం,వృక్ష సంపద, జ్ఞానం, దానం, సామాజిక విశ్వాసం… నిజంగా అక్షయంగా నిలవాల్సినవి.ఆ రోజు బంగారం కొనేంత ఉత్సాహంతో ఒక చెరువును శుభ్రంచేస్తే, ఒక విత్తన భాండాగారాన్ని నిర్మిస్తే, ఒక మొక్కను పెంచితే అదే సమాజానికి అక్షయ సంపద.
‘శ్రీరామనవమి’ ధర్మం జలదానంగా మారే పండుగ. వేసవిలో వచ్చే ఈ పండుగ పానకం, చలివేంద్రం, జలదానం వంటి ఆచారాలతో సమాజ సేవను కలుపుతుంది. శ్రీరాముడు అడవిని జయించడానికి వెళ్లలేదు. వనజీవనంతో సంభాషిస్తూ ధర్మయాత్ర సాగించాడు. రాముడిని పూజించడం అంటే దాహంతో ఉన్న జీవికి నీరు ఇవ్వడం. రామాయణాన్ని చదవడం అంటే భారతభూమితో మన అనుబంధాన్ని గుర్తించడం.
‘శ్రీకృష్ణజన్మాష్టమి’ పండుగ, కృష్ణుని జీవితం భారతీయ గ్రామ స్వావలంబనకు, ప్రకృతితో సహజీవనానికి ప్రతీక. పండుగ శ్రీకృష్ణుని జీవితం గోవు, గడ్డి, గోపాలకులు, యమున, గోవర్ధనగిరి, వృక్షాలు, పక్షులు, గ్రామసమాజంతో ముడిపడి ఉంది. ఆయన ఒక్క జీవిని మాత్రమే రక్షించినట్లు కథలు చెప్పవు. ఒక జీవవ్యవస్థను రక్షించినట్లు చూపుతాయి. గోవు బతకాలంటే మేతభూమి ఉండాలి. మేతభూమి ఉండాలంటే నేల, నీరు నిలవాలి. గోవర్ధనం నిలవాలంటే కొండలు, అడవులు రక్షించబడాలి, పక్షులు బతకాలంటే వృక్షాలు నిలవాలి. గోపాలుడిని ఆరాధి స్తూనే, గోవుల మేతభూములను ఆక్రమించకూడదు. కృష్ణుడిని స్మరిస్తూ నదులను కలుషితం చేయకూడదు. గోవర్ధన గాథ చెబుతూ కొండలను తవ్వివేయకూడదు.
‘వినాయక చవితి’ ప్రపంచానికి ప్రకృతి పాఠం చెప్పగల పండుగ. వినాయకుని ఏనుగు ముఖం వన్యప్రాణుల గౌరవానికి ప్రతీక. మూషికం చిన్న జీవికీ ప్రకృతిలో స్థానం ఉందని చెబుతుంది.
వినాయక చవితి నాటి పత్రిపూజ పిల్లలకు స్థానిక మొక్కల పరిచయం చేస్తుంది. ఆకు పేరు ఏమిటి?ఏ చెట్టుకు చెందింది? ఎక్కడ పెరుగుతుంది? ఆ మొక్కను ఏ జీవులు ఆశ్రయిస్తాయి? దానిని ఎలా సంరక్షించాలి?అనేవి తెలుస్తాయి.
ఈ పండుగ ‘అంతర్జాతీయంగా ప్రకృతి- పరిరక్షణ’ను ప్రతిపాదించగల సాంస్కృతిక సామర్థ్యం కలిగి ఉంది. ప్రతి వినాయక చవితి సందర్భంగా… కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలి. పత్రి మొక్కలను పిల్లలకు పరిచయం చేయాలి. పూజ లందుకున్న వినాయక విగ్రహాలను ఇంటివద్ద లేదా ప్రత్యేక కుండాల్లో నిమజ్జనం చేయాలి
‘బతుకమ్మ’ పుష్ప, జల సంస్కృతి పండుగ. ఇది పూలను, మహిళాశక్తిని, చెరువులను, సామూహికతను ఒకే ఉత్సవంలో కలుపుతుంది. ‘పూలు బతకాలి.
చెరువు బతకాలి. భూగర్భజలం బతకాలి. గ్రామం బతకాలి’ అన్నదే బతుకమ్మ పండుగ అంత రార్థం. ప్లాస్టిక్. ధర్మోకోల్ వంటి వాటిని నివారించి, సహజ పూలతో బతుకమ్మను పేర్చి, నిమజ్జనా నంతరం చెరువును శుభ్రం చేయడమే ఈ పండుగకు తగిన సేవ.స్థానిక ప్రకృతిని ప్రేమించినప్పుడే జాతీయ పర్యావరణం నిలుస్తుంది.
‘దసరా’ నాడు పూజలందుకునే దుర్గ, లక్ష్మి, సరస్వతి..శక్తి, సంపద, జ్ఞానానికి ప్రతీకలు. అయితే…ప్రకృతిని నాశనంచేసే శక్తి దుర్గకాని, భూమిని దోచుకొంటూ సంపాదించినది లక్ష్మి కాని, సమాజ వినాశనానికి ఉపయోగపడే తెలివి సరస్వతీ కటాక్షం కానీ కాదు. జమ్మి ఆకులను బంగారంగా పంచుకోవడం నిజమైన జాతీయ సంపదను గుర్తుచేస్తుంది
ఆయుధపూజ, పనిముట్ల పూజ..శ్రమకు గౌరవం. రైతు నాగలి నుంచి దేశ నిర్మాణానికి ఉపయోగపడే ప్రతి సాధనం పూజనీయం.
‘దీపావళి’ స్వదేశీ శ్రమను వెలిగించే పండుగ. మట్టి ప్రమిదంటే కేవలం దీపం కాదు. కుమ్మరి నైపుణ్యం, రైతు పండించిన నూనెగింజ, పత్తి వత్తి, కుటుంబ భక్తి, అగ్ని శక్తి అన్నీ కలిసున్నాయి. ఈ పండుగ విదేశీ అలంకరణల ప్రదర్శనగా కాకుండా స్థానిక కళాకారులను ప్రోత్సహించే ఉత్సవంగా నిలవాలి.
ఆనందం ఉండాలి; బాధ్యత కూడా ఉండాలి. శిశువులు, వృద్ధులు,.దీపం ఇంటిని వెలిగిస్తుంది; స్వదేశీ కొనుగోలు ఒక కుటుంబాన్ని వెలిగిస్తుంది; ధార్మిక వినియోగం దేశాన్ని బలపరుస్తుంది.
దీపావళిలో మట్టి ప్రమీద భూమికి, నూనె వ్యవసాయానికి, వత్తి పత్తిపంటకు, జ్యోతి అగ్ని శక్తికి ప్రతీక. ఒక చిన్న దీపం వెనుక రైతు, కుమ్మరి, చేతివృత్తి, ప్రకృతి వనరుల సమన్వయం ఉంది.
దీపావళి చీకటిని తొలగించమంటుంది
‘గోవర్ధన పూజ’ కొండను కేవలం రాళ్ల గుట్టగా చూడడం వాణిజ్య దృష్టి అనిపిస్తుంది. అడవి, మేతభూమి, పశుపక్ష్యాదుల ఆవాసం, గ్రామ భద్రతగా చూడడం భారతీయ సమగ్ర దృష్టి. కొండను రాయిగా చూస్తే తవ్వకం కనిపిస్తుంది;
మాతృభూమిని శరీరంగా చూస్తే జాతి భవిష్యత్తు కనిపిస్తుంది.కొండను రాయిగా చూస్తే ఖనిజం కనిపిస్తుంది. జీవవ్యవస్థగా చూస్తే ఊరి భవిష్యత్తు కనిపిస్తుంది.
గోవర్ధన పూజ సవి•ప కొండలు, గుట్టలు, సహజ జలప్రవాహాలు, మేతభూములను రక్షించే ప్రజా సంకల్పంగా మారాలి.
‘సంక్రాంతి’ జాతీయ ఆహార భద్రతకు కృతజ్ఞతా పర్వం. పండుగకు, సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, బిహులాంటి ఎన్ని పేర్లున్నా, ప్రాంతాలు వేరైనా మూలభావం ఒకటే. అది: సూర్యుడు, భూమి, పంట, రైతు, భోగ వినియోగ వృథాను తగ్గించాలి. రైతు శ్రమను గౌరవించాలి.పశువుకు కుంకుమతో పాటు జీవితకాల సంరక్షణ ఇచ్చేలా కనుమనాడు పశుసంపదను పూజించాలి. రైతు బలహీనపడితే దేశం దిగుమతులపై ఆధారపడుతుంది. స్థానిక విత్తనం నశిస్తే ఆహార స్వావలంబన నశిస్తుంది.పశుసంపద, నేల, నీరు దెబ్బతింటే జాతీయ భద్రత కూడా దెబ్బతిం టుంది.అన్నదాతను గౌరవించడం భావోద్వేగం మాత్రమే కాదు-జాతీయ కర్తవ్యం. సంక్రాంతి మనిషి పంట పండించాడని చెప్పదు; సూర్యుడు భూమి- నీరు- పశువు-రైతు కలిసి పండించారని చెబుతుంది.
‘మహాశివరాత్రి’ జీవ వైవిధ్యంలో సమతుల్యతే శివం. శివ కుటుంబంలో నంది, సింహం, నెమలి, నాగు, ఎలుక వంటి సహజంగా భిన్న సంబంధాలున్న జీవులు ఒకే కుటుంబంలో స్థానం పొందాయి.
– మూర్తి





