News

ఆలయ ఆరాధనా సంప్రదాయాలకు ఆగమ శాస్త్రాలే ప్రామాణికం

26views

దేవాలయ ఆరాధనా విధానాలు, భారతీయ సనాతన సంప్రదాయాల పరిరక్షణలో ఆగమ శాస్త్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు వేద పండితులు పేర్కొన్నారు. ముఖ్యంగా వైఖానస భగవచ్ఛాస్త్రం దేవాలయాల్లో స్వామివారి నిత్య కైంకర్యాలు, పూజా విధానాలు, ఉత్సవాల నిర్వహణకు ప్రామాణికంగా నిలుస్తోందని వివరించారు.

కార్తీక మాస శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అత్రి మహర్షి జయంతి వేడుకలను తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించారు. వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆల్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ.. భారతీయ దేవాలయ వ్యవస్థకు ఆగమ శాస్త్రాలు వెన్నెముక వంటివని పేర్కొన్నారు. ముఖ్యంగా వైఖానస ఆగమ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా అనేక వైష్ణవ ఆలయాల్లో ఆచరణలో ఉందని తెలిపారు. భగవంతుడి ఆరాధనకు సంబంధించిన నియమాలు, పూజా క్రమాలు, ఉత్సవ విధానాలను వైఖానస భగవచ్ఛాస్త్రం శాస్త్రీయంగా నిర్దేశించిందని వివరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం కూడా వైఖానస ఆరాధనా విధానంలోని ప్రాయశ్చిత్త ప్రక్రియలో భాగమని పండితులు వెల్లడించారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే వివిధ కైంకర్యాలు, ఉత్సవాల వెనుక ఉన్న ఆగమ సంప్రదాయ ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమానికి వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి దీవి శ్రీనివాస దీక్షితులు అధ్యక్షత వహించారు. టీటీడీ ఆగమ సలహాదారులు అర్చకం అనంతశయన దీక్షితులు, ఖాద్రీ నరసింహాచార్యులు, విఖనస ట్రస్ట్ కార్యదర్శి జి. ప్రభాకరాచార్యులు తదితర పండితులు ప్రసంగించారు. వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

భారతీయ దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు.. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక జ్ఞానం, వేద విజ్ఞానం, శిల్పకళ, సంస్కృతికి ప్రతీకలు. ఆగమ శాస్త్రాల్లోని ఆరాధనా విధానాలను భావితరాలకు అందించడం ద్వారా సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుకోవచ్చని పండితులు అభిప్రాయపడ్డారు.