News

ఆంధ్రా నుంచి అరుణాచలానికి కార్తిగై దీపం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

24views

కార్తిగై దీపం మహోత్సవాల వేళ అరుణాచలం వెళ్లే యాత్రికులకు రైల్వే శాఖ ఊరటనిచ్చింది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగే ఈ దీపోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తోంది. విశాఖపట్నం నుంచి తిరువణ్ణామలై మార్గంతో పాటు తిరుపతి-విశాఖ మధ్య కూడా ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

విశాఖపట్నం-తిరువణ్ణామలై స్పెషల్ ట్రైన్ (నంబర్ 08579) నవంబరు 22న ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5.50 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (నంబర్ 08580) నవంబరు 23న సోమవారం రాత్రి 9 గంటలకు తిరువణ్ణామలైలో బయల్దేరి, నవంబరు 24 మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ సర్వీసుకు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో హాల్ట్‌లు కల్పించారు.

మరోవైపు తిరుపతి-విశాఖపట్నం మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తిరుపతి-విశాఖ స్పెషల్ (నంబర్ 07423) నవంబరు 21న శనివారం రాత్రి 9.50 గంటలకు బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇది రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, అన్నవరం మీదుగా ప్రయాణిస్తుంది.

ఇక తిరుగు ప్రయాణంలో విశాఖ-తిరుపతి రైలు (నంబర్ 07424) నవంబరు 24 రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలుకు న్యూ గుంటూరు, తాడేపల్లిగూడెం, ఏలూరు మార్గాల్లో స్టాప్‌లు ఇచ్చారు. ఈ రైళ్లలో 4 జనరల్, 8 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే తిరుపతి-విశాఖ మధ్య తిరిగే ప్రత్యేక రైళ్లలో సాధారణ ఛార్జీల కంటే 1.3 రెట్లు అధికంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.