
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రకు సంబంధించి మరో కీలక చారిత్రక ఆధారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంపై చెక్కిన రెండు అరుదైన శాసనాలను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) గుర్తించింది. ఈ శాసనాల్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల తిరుమల తొలి యాత్రతో పాటు, ఆయన రాణులు శ్రీవారికి సమర్పించిన విలువైన బంగారు కానుకల వివరాలు నమోదై ఉన్నాయి.
భారతీయ చారిత్రక వారసత్వాన్ని డిజిటలైజ్ చేసే ‘భారత్-శ్రీ’ ప్రాజెక్టులో భాగంగా ఈ శాసనాలను గుర్తించారు. ఇప్పటికే తిరుమల ఆలయానికి సంబంధించిన దాదాపు వంద శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. వీటిని భారత్-శ్రీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పురావస్తు శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఆలయంలోని మొదటి ప్రాకారానికి ఉత్తరం వైపున ఉన్న గోడపై ఈ రెండు శాసనాలు తెలుగు భాషలో చెక్కబడి ఉన్నాయి. ఏఎస్ఐ గుర్తించిన వివరాల ప్రకారం, ఈ శాసనాలు 1513 ఫిబ్రవరి 10వ తేదీకి సంబంధించినవి. వీటిలో శ్రీకృష్ణదేవరాయల రాణులైన చిన్నాజీ అమ్మ, తిరుమలమ్మ శ్రీవారికి సమర్పించిన బంగారు కానుకల ప్రస్తావన ఉంది.
రాత్రి పూజ అనంతరం తిరువేంగళనాథుడైన శ్రీ వేంకటేశ్వరస్వామికి పాలు సమర్పించేందుకు 374 తూకాల బరువున్న రెండు బంగారు గిన్నెలను, సుగంధ ద్రవ్యాలు ఉంచేందుకు 10 తూకాల బరువున్న బంగారు పళ్లేన్ని రాణులు కానుకగా సమర్పించినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ శాసనాలు విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల క్షేత్రానికి రాజకుటుంబం అందించిన భక్తి, ఆదరణ, వైభవానికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో తిరుమల ఆలయానికి లభించిన రాజపోషణ, ఆనాటి ఆచార వ్యవహారాలు, ఆలయ పూజా సంప్రదాయాలపై పరిశోధనలకు ఈ శాసనాలు విలువైన ఆధారాలుగా నిలవనున్నాయి.
మన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. భారతీయ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ, రాజవంశాల వైభవాన్ని చాటిచెప్పే సజీవ చారిత్రక నిధులు. ఇలాంటి శాసనాలను గుర్తించి, డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించడం భారతీయ వారసత్వ పరిరక్షణలో కీలక ముందడుగు.





