
విశాఖ నగరాన్ని కొత్త రాజధానిగా ప్రకటించడంతో అక్కడ ఖాళీ భూములపై రాజకీయ రాబందుల కళ్ళు పడ్డట్టు ఉన్నాయి. తాజాగా విశాఖ నగరం వెంకోజిపాళెంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జ్ఞానానంద – రామానంద ఆశ్రమంపై కొందరి పెద్దల కన్ను పడింది.
రాజకీయ అధికారం చేతిలో ఉండడంతో విశాఖ ఎంపీ, ఎం వి వి సత్యనారాయణ, మరో నాయకుడు పీలా కోటేశ్వరరావు లు ఆశ్రమ స్థలంలో వేరువేరుగా అపార్టుమెంట్లు నిర్మించారు. దీనిపై ఆశ్రమ వర్గాలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. అంతటితో ఆగక ఆ ఆశ్రమాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలంటూ ఏకంగా దేవాదాయ శాఖకు లేఖలు రాశారు. ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి పూర్ణానంద సరస్వతిని కొందరు ఫోనులో బెదిరించడమే కాక, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని రంగంలోకి దింపి అతనితో బెదిరించారు. ఆశ్రమాన్ని తమకు అప్పగించకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. చివరికి రెవెన్యూ అధికారులు కూడా ఆశ్రమానికి వచ్చి స్వామితో రాయబారాలు నడిపారు.

దీంతో స్వామి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశ్రమాన్ని కాపాడాలని కోరారు. “నాకు ప్రాణహాని ఉంది. ఆశ్రమాన్ని, నన్ను కాపాడండి” అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పలువురు మంత్రులకు విన్నవించుకోవడమేకాక నగరంలోని పలువురు ప్రముఖుల్ని కలిసి తనకు ప్రాణహాని ఉందని మొర పెట్టుకుంటున్నారు.
Source : Andhra Jyothi





