ArticlesNews

సంఘ శాఖ – దేశం కోసం తపస్సు

319views

ఎంత చిన్నదైనా ఒక నియమం అంటూ పెట్టుకుని, దాన్ని పరిపూర్ణంగా జీవితమంతా పాటిస్తూ ఉండడమే తపస్సు. ఒక వ్యక్తి రోజూ ఒక నిర్దిష్ట సమయంలో 108 పూసల జపమాల పట్టుకుని రామ నామం జపించాలి అని నిర్ణయించుకున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఆ నియమాన్ని ప్రతీ రోజూ క్రమం తప్పకుండా తప్పనిసరిగా పాటిస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తపస్సు చేస్తున్నాడు అన్నమాటే. ఇంక నియమాల విషయానికి వస్తే, అది ఏదైనా పరీక్ష కావచ్చు, లేక మీ సొంత వివాహం కావచ్చు, లేక మరేదైనా విషాద సందర్భం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు ఆ నియమాన్ని పాటించవలసిందే. అదే పద్ధతిని ఏళ్ళ తరబడి కొనసాగిస్తే అదే తపస్సు అయిపోతుంది. ఆ వ్యక్తి నైతిక స్థైర్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ సంతోషకరమైన, దుఃఖకరమైన సందర్భాలు ఉంటూనే ఉంటాయి. ఉన్నత స్థాయి నైతిక విలువలు కలిగిన వ్యక్తి అలాంటి సందర్భాలను చాలా సులువుగా సహించగలుగుతాడు.

ప్రతీ రోజూ శాఖకు వెళ్ళడం కూడా ఒక నియమమే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించి, దాని పనితీరు విధానాన్ని సైతం రూపొందించిన డా.కేశవ బలీరామ్ హెడ్గేవార్‌ గారు ఒక గ్రామానికి ఏదో పని మీద వెళ్ళారు. అక్కడ ఆయనకు తన పని పూర్తి చేసుకుని వెనుదిరగడానికి ఆలస్యం అయింది. మర్నాడు ఉదయమే ఆయన నాగపూర్‌లోని ప్రభాత శాఖకు హాజరు కావలసి ఉంది. అయితే అప్పుడు ఎలాంటి బస్సులూ లేవు. దాంతో ఆయన కాలి నడకన బయల్దేరారు. ఆయన చాలాదూరం నడిచిన తర్వాత వెనుక నుంచి ఒక ట్రక్కు వచ్చింది. డాక్టర్‌జీని చూసి ఆ వాహనం ఆగింది. ఆ ట్రక్కు డ్రైవర్‌కు డాక్టర్‌జీ ఎవరో ఏమిటో తెలుసు. దాంతో అతను ఆయనను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అలా ఆయనకు నడకా తప్పింది, మర్నాడు ఉదయం సంఘ శాఖకు సరైన సమయానికి సురక్షితంగా చేరుకోగలిగారు.

డాక్టర్‌జీ మేనత్తగారు అనారోగ్యంతో ఉన్నారు. దాంతో ఆయనకు కొన్ని రోజుల పాటు ఇండోర్ వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన అక్కడ రెండు శాఖలు ప్రారంభించారు, అవే ఇండోర్, దేవాస్ శాఖలు.

బిహార్‌లోని రాజ్‌గిర్‌లో వేడినీటి ఊటలు ఉన్నాయి. ఒకసారి డాక్టర్‌జీ అక్కడకు చికిత్స కోసం వెళ్ళారు. అక్కడ ఆయన ‘విద్యార్ధుల శాఖ’ ప్రారంభించారు.

ఒకసారి విశ్వ హిందూ పరిషత్ మహారాష్ట్ర విభాగం సమావేశం పండరీపురంలో నిర్వహించారు. ఆ సమావేశానికి పూజనీయులు ధూండా మహరాజ్‌ దెగ్లూకర్ అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలోని పలువురు వక్తల్లో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండవ సర్‌సంఘచాలక్ శ్రీ గురూజీ కూడా ఒకరిగా ఉన్నారు. ఆయన సమావేశ అధ్యక్షుడికి ఒక విజ్ఞప్తి చేసారు. ‘‘నేను ఉదయం 7 గంటలకు సంఘ శాఖకు వెడతాను, 7.30 గంటలకు తిరిగి వస్తాను. కాబట్టి నా ప్రసంగాన్ని దయచేసి ఆ సమయం మినహా మిగతా సమయంలో ఎప్పుడైనా ఖరారు చేయండి’’ అని కోరారు. శాఖకు ఎప్పుడూ గైర్హాజరు కాకూడదు అన్నది గురూజీ నియమం. ఆ విషయం ధూండా మహరాజ్‌ గారికి తెలుసు. అందువల్ల ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ముందుగా పండరీపురం నగర కార్యవాహ వేదిక దగ్గరకు ఒక వాహనంతో వచ్చారు. గురూజీ శాఖకు వెళ్ళారు, అరగంటలో శాఖ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సమావేశానికి తిరిగి వచ్చి, అక్కడ తన ప్రసంగం ఇచ్చారు.

ఐదవ సర్‌సంఘచాలక్ విధుల నుంచి విశ్రాంతులు అయిన తరవాత పూజనీయ సుదర్శన్‌జీ భోపాల్‌లోని సంఘ కార్యాలయం ‘సమిధ’లో నివసించారు. అక్కడ ఆయన పరిచయాలు పెంచుకుని, విద్యార్ధుల కోసం శాఖ ప్రారంభించారు. 80 ఏళ్ళ వయసులో ఆయన చిన్నపిల్లల శాఖకు క్రమం తప్పకుండా వెడుతుండేవారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే మనకు సంఘ కార్యం పట్ల అంకితభావం ఉన్న కార్యకర్తలు కచ్చితంగా దొరుకుతారు. వాళ్ళు ఏ ఒక్క రోజూ శాఖకు గైర్హాజరు అవరు. పరీక్షలు కానివ్వండి, ఇంట్లో ఏదైనా పవిత్ర కార్యం కానివ్వండి, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే శాఖకు హాజరై తీరతారు.

ఒక జిల్లా ప్రచారక్ ఒక సంఘటనను గుర్తు తెచ్చుకున్నారు. ఒక స్వయంసేవక్ సోదరి 28 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె బస్సులో ప్రయాణిస్తూ ఉండగా తుదిశ్వాస విడిచారు. ఆ యువతి బదులు ఆమె మృతదేహం ఇంటికి చేరుకునేసరికి ఆమె తల్లిదండ్రుల శోకానికి అంతే లేకుండా పోయింది. ఆ యువతి అంత్యక్రియలు మర్నాడు నిర్వహించాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఆ స్వయంసేవక్ ఆ రోజు సాయంత్రం శాఖకు హాజరయ్యారు.

ప్రతీరోజూ దేశవ్యాప్తంగా వేలాది శాఖల్లో లక్షల మంది స్వయంసేవకులు ‘‘పతత్వేష కాయో నమస్తే నమస్తే’’ అంటూ భారతమాతకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది సామూహిక నిర్ణయం. వారెవరికీ వ్యక్తిగత లాభాలు పొందాలన్న కోరిక లేదు. సంఘ శాఖ అనేది సమష్ఠిగా చేసే తపస్సు. దేశ హితమే లక్ష్యంగా పదుగురు కలసి చేసే తపస్సు. తపస్సు వల్ల ఒక వ్యక్తిది మాత్రమే కాదు, సమాజానికీ దేశానికీ కూడా నైతిక స్థైర్యం పెరుగుతుంది.

హిందూ సమాజం ఓటమి అనే మనస్తత్వం నుంచి బైటపడాలి, విజయం సాధించాలన్న భావనతో ఎదగాలి.

‘‘స్వయంసేవకుడు శాఖను కొనసాగించడం ద్వారానే పరిపూర్ణ విజయం సాధ్యమవుతుంది’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండవ సర్‌సంఘచాలక్ శ్రీ గురూజీ చెబుతుండేవారు.

ఏకాత్మతా మానవ దర్శనం సిద్ధాంతకర్త అయిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ సమాజపు విరాడ్రూపం (సామూహిక చైతన్యం) ఎప్పుడూ జాగృతంగా ఉండాలి. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ, కఛ్ నుంచి కామెరూన్ వరకూ వ్యాపించి ఉన్న యావత్ హిందూ సమాజం ‘రామజన్మభూమి ముక్తి యజ్ఞం’ అనే ఒకే లక్ష్యంతో కలసికట్టుగా నిలబడి ఉండడం సమస్త భారతదేశానికీ అనుభవం అయింది. దేశంలోని లక్షలాది గ్రామాల నుంచి ప్రజలు పూజలు చేసి తమతమ గ్రామాల నుంచి శ్రీరామ శిలను అయోధ్యకు పంపించారు. శ్రీరాముడి మీద భక్తి కారణంగానే అది సాధ్యమయింది. ఆ సమయంలోనే దూరదర్శన్‌లో శ్రీ రామానంద సాగర్ నిర్మించిన రామాయణం సీరియల్ మొదాలైంది. ‘శ్రీరామ’ అనే మూడు అక్షరాల ప్రభావం ప్రజల మనసుల్లో ఎంత మహత్తరంగా ఉందన్న సంగతిని యావత్ దేశం అనుభవపూర్వకంగా తెలుసుకుంది. సమాజంలో విస్తారంగా వచ్చిన జాగృతి యొక్క నిజమైన స్వరూపం రెండు కరసేవ సందర్భాల్లోనూ స్పష్టమయింది. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని తెగల నుంచి స్త్రీలూ పురుషులూ అనే తేడా లేకుండా కరసేవకులు, కొన్ని సందర్భాల్లో శ్రీరాముడిని తమ పూర్వీకుడిగా భావించే కొంతమంది ముస్లిములు, క్రైస్తవులు కూడా, అందరూ కలసి వచ్చారు. వారిలో బహుశః అన్ని రాజకీయ పక్షాల వారూ కూడా ఉండి ఉంటారు.

కరసేవకుల మనసుల్లో ఒక బలమైన సంకల్పం ఉండింది. ఐదు శతాబ్దాలుగా తమ మీద రుద్దబడిన అవమానపు మరకను, ఆ కళంకాన్ని కడిగేసుకోవాలన్నదే ఆ దృఢ సంకల్పం. అందుకే మన బానిసత్వానికి చిహ్నంగా ఐదు వందల యేళ్ళుగా నిలబడి ఉన్న ఆ వివాదాస్పద బాబరీ కట్టడం ఐదే ఐదు గంటల్లో కూలిపోయింది.

రాజా సుహేల్‌దేవ్ కాలం నుంచి నేటివరకూ ఎన్నో యుద్ధాలు జరిగాయి. లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేసారు. కానీ తూర్పు-పడమర-ఉత్తరం-దక్షిణం అన్ని వైపుల నుంచీ అందరు హిందువుల మనసుల్లోనూ ఒకటే కోరిక. అలాంటి అద్భుతమైన కార్యక్రమం మన దేశ చరిత్రలో దాదాపు అదే మొదటిది. ‘యథా రాజా తథా ప్రజా, రాజు ఎలాంటి వాడయితే ప్రజలు కూడా అలాంటి వారే అవుతారు’ అని రాజుల కాలంలో చెబుతుండేవారు. దాన్ని ఇప్పుడు మార్చుకోవాలి. ‘యథా ప్రజా తథా రాజా, ప్రజలు ఎలాంటివారు అయితే పాలకులు కూడా అలాంటివారే అవుతారు’.

దేశంలోని నలుమూలల నుంచీ సుదూర ప్రాంతాల నుంచీ అయోధ్యకు చేరుకున్న కరసేవకులు, సమాజంలో విరాట్ రూపంలో కలిగిన జాగృతిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దేశం ఉత్తర భాగం నుంచి వచ్చిన వారికి తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం అర్ధం అయేవి కావు. దక్షిణ భారత ప్రాంతాల నుంచి వచ్చిన కరసేవకులు హిందీలో మాట్లాడలేకపోయేవారు. కానీ వారి మధ్య ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. తమ ప్రాంతం పేరు చెప్పి కరసేవకులం అని చెబితే చాలు, వారిని సాదరంగా ఆహ్వానించేవారు. అది వారిని ఎంతగానో సంతోషపరిచింది. దక్షిణ దేశం నుంచి వచ్చిన కరసేవకులను తమ ఇళ్ళకు ఆహ్వానించే వారు, వారికి మర్దనా చేసుకోడానికి నూనె, వేణ్ణీళ్ళు ఇచ్చేవారు. రాత్రి ఉండవలసి వస్తే వారికి భోజనం, పడక అమర్చేవారు. వారిలో ఏ ఒక్కరికీ ఇంకొకరు పరిచయం అవసరం లేదు. వాళ్ళందరూ వెడుతున్నది రామ కార్యం కోసమే అన్న నిజం ఒక్కటి తెలుసు, అది చాలు.

వివాదాస్పద కట్టడం దగ్గర కరసేవ జరిగి మూడు దశాబ్దాలు గడచిపోయాయి. తరాలు మారిపోయాయి. కానీ రామ మందిరం కోసం విరాళాలు ఇవ్వడంలో ప్రజల ఉత్సాహం ఏమాత్రం మారలేదు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రజల్లో చెలరేగిన భావోద్వేగాలు, ఆనందోత్సాహాలూ ‘న భూతో న భవిష్యతి’.

అటువంటి అనుభూతే కలిగిన మరో సందర్భం శ్రీ రామసేతు రక్షా ఆందోళన. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎర్నాకుళం వరకూ దేశం అంతటా ఒకే సమయంలో రెండు గంటల పాటు రాస్తారోకోలు నిర్వహించారు.

అమరనాథ్ ఆలయ బోర్డు భూమి వివాదం సమయంలో, జమ్మూలోని ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ పార్వతి, శంకరుడు, గణపతిల అవతారాలు అయిపోయారు.

ఇటీవలి కాలానికి చెందిన గొప్ప వీరులు, పోరాట యోధులు అయిన మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, దాష్‌మేష్, శ్రీ గురు గోవింద్ సింగ్, లచిత్ బర్ఫుఖన్, హరిహర రాయలు బుక్కరాయలు వంటి వారు హిందూ సమాజపు విరాడ్రూపాన్ని మనలో జాగృతం చేసారు. అయితే అది ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రదేశానికే పరిమితమైంది, కొంత కాలానికే పరిమితమైంది. స్వతంత్ర భారతంలో ప్రజాస్వామిక సమాజం ఏర్పడిన తర్వాత తూర్పు-పడమర-ఉత్తరం-దక్షిణం అన్ని వైపులా హిందూ సమాజం ఏకమొత్తంగా జాగృతం అవడం అనేది మొట్టమొదటిసారి జరిగింది.

కొన్ని సంఘటనలకు స్పందనగా సమాజం జాగృతం అవడం అనేది వివిధ దేశాల మధ్య పోటీ నెలకొన్ని ఉన్న వాతావరణంలో అంతగా ఎక్కువ ప్రయోజనకరం కాదు. సమాజపు విరాట్ రూపం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేశం బాగుండాలనే కోరికతో డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను ప్రారంభించారు. జాగృతమైన విరాట్ స్వరూపం అనేది ఆత్మగౌరవానికి చిహ్నం, దేశ రక్షణకు గ్యారంటీ, అభివృద్ధి పథంలో విశ్వాసం ఉంచడమే అవుతుంది.

ప్రతీరోజూ శాఖ అనేది సంఘ కార్యక్రమంలో వాస్తవిక కార్యాచరణ. ప్రతీ రోజూ దేశం బాగుండాలి అనే ఆకాంక్షను అనుదినం గుర్తు చేసుకునే ప్రదేశం.

రామ నామాన్ని ప్రతీరోజూ జపించాలి అనేది ఒక వ్యక్తి చేసుకునే వ్యక్తిగతమైన నిర్ణయం. కానీ దేశం కోసం అనే నిర్ణయం సమష్ఠిగానే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని ప్రతీరోజూ గుర్తు చేసుకోవడమే ‘తపస్సు’. దేశం మేలు కోసం ఒక సమష్ఠి నిర్ణయం తీసుకోడానికి సరైన వేదిక సంఘశాఖ. సంఘ శాఖే జాతీయ తపఃస్థలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80వేల తపోస్థలాల్లో లక్షలాది ప్రజలు ‘పరమ వైభవమ్ నేతుమ్ ఏతత్ స్వరాష్ట్రమ్’ అనే ప్రార్థన రూపంలో ఒకే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు.

‘పరమ వైభవమ్ నేతుమ్ ఏతత్ స్వరాష్ట్రమ్’ అనే ప్రార్థనను శాఖలో ప్రతీరోజూ ఆలపిస్తారు. మహోన్నతమైన ఆనందాన్ని ఇచ్చేదాన్నే పరమ వైభవమ్ అని పిలవవచ్చు. ఆ ఉత్కృష్టమైన ఆనందానికి నిర్వచనం సంఘ ప్రార్థనలో ఒక సూత్రంలా చెప్పబడింది. సమాజంలోని ప్రతీ విభాగమూ సముత్కర్ష, నిశ్శ్రేయస అనే రెండింటినీ సాధించడమే పరమానందం. సముత్కర్ష అంటే భౌతికమైన సంపద, నిశ్శ్రేయస అంటే ఆధ్యాత్మిక సంపద లేదా జ్ఞాన సంపద.

పరమ వైభవం అనేది సమగ్రమూ సార్వకాలికమూ సార్వజనీనమూ అయిన విధానాన్ని అందించే మార్గం. వర్గ పోరాటం లేక భయంకరమైన పోటీ అనేవి దానికి ప్రాతిపదికలు కావు. అందరూ సోదరులే అని భావించే సౌభ్రాతృత్వం మాత్రమే పరమ వైభవానికి ప్రాతిపదిక. సౌభ్రాతృత్వం అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రం. ‘తత్ త్వమ్ అసి’ అనే విశ్వజనీనమైన వాస్తవాన్ని అభ్యాసం చేయడమే సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు అదే వైజ్ఞానికమైన ప్రాతిపదిక. బహుశా అందుకే భగవాన్ గౌతమ బుద్ధుడి ధమ్మం నుంచి స్వీకరించిన నియమాలు అవే తప్ప తన మనసులో భౌతికమైన ఫ్రెంచి విప్లవం ఎప్పుడూ లేదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు.

‘తత్వమసి’ అనే సత్యంలోని నిజమేమిటో అర్ధం చేసుకున్నాక, దాన్ని గ్రహించుకున్నాక, సౌభ్రాతృత్వం అనే అనుభూతిని ఎంత వరకైనా విస్తరింపజేసి, అభివృద్ధి చేయవచ్చు. ఆ భావనను మన కుటుంబానికి, మన గ్రామానికి, మన దేశానికి, మన ప్రపంచానికి, మన విశ్వానికి, అంతకు మించిన చోటికి, ఈ సర్వ ప్రకృతి సృష్టికీ విస్తరింపజేయవచ్చు. ఆ సత్యానికి విస్తృతమైన రూపమే ‘వసుధైవ కుటుంబకమ్’. అంటే ఈ భూమండలం మొత్తం ఒకటే కుటుంబంగా ఉండాలి అని అర్ధం.

తత్వమసి అనే సార్వకాలిక సత్యం మీద ఆధారపడి ఉన్న జ్ఞాన సంప్రదాయమే ధర్మం. ప్రార్థనలో ఒక చాలా ముఖ్యమైన వాక్యం ఉంది. తపోశక్తి లేక సంస్థాగతమైన బలాన్ని చూసుకుని అహంభావం తలకెక్కి మన లక్ష్యం నుంచి మనం వెనుదిరగకూడదు అని గుర్తు చేసే వాక్యం అది. దాని అర్ధాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే ఇలా ఉంటుంది.. ‘విజయవంతమైన మన వ్యవస్థీకృత బలం ఈ ధర్మాన్ని రక్షించగలదని, మన దేశానికి అత్యున్నతమైన స్థాయిని తెచ్చిపెట్టగలదనీ భావిద్దాం’.

విజేత్రీ చ నః సంహతా కార్యశక్తిః
విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్
పరమ్ వైభవమ్ నేతుమేతత్ స్వరాష్ట్రమ్
సమర్థా భవత్వాశిషా తే భుశమ్

‘‘మన ఉమ్మడి కార్యశక్తి మనను విజయం వైపు నడిపిస్తుంది. మన ధర్మాన్ని చట్టబద్ధంగా పరిరక్షిస్తుంది. మన దేశాన్ని మహోజ్వల స్థితికి తీసుకువెడుతుంది, మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదిస్తుంది.’’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్‌జీ హెడ్గేవార్ 1940లో స్వర్గస్తులయ్యారు. 1939లో సింధ్‌లో సంఘంలో ప్రధానమైన పదాధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశాలు పది రోజుల పాటు కొనసాగాయి. ఆ సమావేశాల్లోనే ఈ ప్రార్థన సంఘ ప్రార్థనగా ఏకగ్రీవంగా ఎన్నికయింది. 1940 నుంచి నేటి వరకూ దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ అంటే అన్ని తపోస్థలాల్లోనూ ఇదే ప్రార్థనను వల్లె వేస్తున్నారు. ఇన్నేళ్ళ తపస్సు ఫలితంగా సంఘ ప్రార్థనకు ఇప్పుడు మంత్రానికి ఉండే శక్తి లభించింది.

స్వతంత్ర ఉద్యమం లాంటి ఎడతెరిపి లేని సమయంలో కూడా పూజనీయ డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్, దూరదృష్టి కలిగిన తన ఆలోచనతో, ఈ దేశానికి సంఘ శాఖను ఇచ్చారు. అది మనకు వ్యవస్థ అనే విజ్ఞానాన్ని బోధించింది, ఈ దేశం బాగుండాలి అని కోరుకునే సమగ్రమైన దర్శనాన్ని ప్రార్థన రూపంలో ఇచ్చింది. అదే డాక్టర్‌జీ హెడ్గేవార్ ప్రారంభించిన సంఘం ప్రత్యేకత.

పదండి, మనం మన ఇంటికి దగ్గరలో ఉన్న సంఘ శాఖకు వెడదాం. దేశం మేలు కోసం జరుగుతున్న తపస్సులో భాగస్వాములం అవుదాం.