ArticlesNews

నడయాడే దేవుళ్లు

313views

కుటుంబ ప్రభోధన్

హిందూధర్మం మహాసముద్రం లాంటిది. సముద్రంలోని ప్రతి బిందువూ సాగర అంశే అయినట్టు హైందవంలోని ఉపదేశాలు, నియమాలు, సంప్రదాయాలు అన్నీ ధర్మ వివేచనకు నెలవులై విషయ విశిష్టత, భావగాంభీర్యం కలిగి ఉంటాయి. అందుకు కారణం మన పూర్వీకులు సంపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనాపరులు కావడమే. వారు తుచ్ఛ సుఖాలను వదిలిపెట్టి శాశ్వత బ్రహ్మవిద్యపై దృష్టి కేంద్రీకరించారు. కల్లాకపటం తెలియని వయసునుంచే భక్తి వైరాగ్యాది సద్గుణాలను అలవరచుకోవాలన్నారు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించలేనివారు అందరిలో, అన్నింట్లో, అంతర్గతంగా ఉండే భగవంతుణ్ని ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సెలవిచ్చారు. వారిపై భక్తి ప్రపత్తులు కలిగి స్వీయానుభవాలకు పసితనం నుంచి మెరుగులు దిద్దుకుంటూ పురోగమించాలన్నది మన పెద్దల ఆకాంక్ష. శరీరం డస్సిపోయి, కనుచూపు మందగించి, ఊతకర్ర లేకుండా ముందుకు వెళ్లలేని ముదుసలికి ఇవి సాధ్యపడవు.

గంగాతీర్థం కొద్దిగా సేవించినా గంగానదిని దర్శించాలనే కోరిక కలుగుతుంది. అదే విధంగా కొద్దికొద్దిగా బుద్ధి వికసిస్తూపోతే బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది. ‘కలడంబోధి గలండు గాలి గలదాకసంబునుం’ అని చెప్పినట్టుగా దిశలన్నీ దేవుడే అయినప్పుడు ఈ ప్రపంచానికి తల్లి, తండ్రి, గురువులను నడయాడే దీపాలు, ధర్మధ్వజాలుగా భావించడం తప్పుకాదు.

ధర్మమూర్తి అయిన దేవవ్రతుడు తండ్రి కోరిక నెరవేర్చేందుకు సింహాసనాన్ని వదులుకోవడమే కాకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని శపథం చేశాడు. దేవర్షిగణంతో ‘భీష్మ’ అనిపించుకున్నాడు. శ్రీరాముడి పితృభక్తి, ఏకలవ్యుడి గురుభక్తి అద్వితీయమని అందరికీ తెలిసిందే. మాతృప్రేమ ఉగ్గుపాలతో వస్తుంది. ఈ ప్రేమ భక్తిగా మళ్లినప్పుడు తండ్రి, గురువులపై చెప్పకనే భక్తి కలుగుతుంది. మనసును తన ఆధీనంలో పెట్టుకోగలిగినప్పుడు మనిషికి అహంకారం నశిస్తుంది. స్థిరమైన మనసుతో మోక్షసాధనకు ప్రయత్నించి సాధిస్తాడు. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, బాధించడం మానవతకే మచ్చ. మమ్మల్ని అడిగి కన్నారా అని నిలేసే ప్రబుద్ధ బిడ్డలూ ఉన్న లోకమిది. తల్లిదండ్రులే పిల్లలకు ఉపకారబద్ధులుగా ఉండాలని చెప్పే వ్యక్తులూ ఉన్నారు. ఇలాంటి విభిన్న ప్రవృత్తులు, సంకుచిత స్వభావాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న పెద్దలు మానవ పురోగతికి సులభమార్గాలు చూపించారు. పూజా సమయంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే నాలుగింటిలో భక్తిభావంతో ఏ ఒక్కటి సమర్పించినా అది భగవంతుడికే చెందుతుంది. ఒకవేళ అవి కూడా లేని పరిస్థితుల్లో ‘కృష్ణార్పణం’ అని చేతులు జోడించి దండం పెట్టుకోమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పెద్దల్ని గౌరవభావంతో చూస్తే పూజించినట్టే అవుతుంది.

అమ్మానాన్నలు ఎన్నో ప్రయాసలకోర్చి బిడ్డను కని పెంచుతారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమతో పెద్ద చేస్తారు. అందుకు ప్రతి వ్యక్తీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడిగా ఉండాలి. పనుల ఒత్తిడివల్ల ఎల్లవేళలా వారిని సేవించేంత సమయం లేకపోయినా నిండు మనసుతో పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటే అవి తప్పక ఫలిస్తాయి.