
4views
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ నిధులు పొందుతున్న 558 మదర్సాలలో అక్రమాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించిన వివాదంలో అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎన్‌హెచ్చార్సీ ఉత్తర్వులను జడ్జి జస్టిస్ అతుల్ శ్రీధరన్ గట్టిగా తప్పుపట్టారు. ముస్లింలు మూకదాడులకు గురైనప్పుడు సుమోటోగా చర్యలు చేపట్టని ఎన్‌హెచ్‌ఆర్సీ…మదర్సాల విషయంలో ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. ఇందులో మానవ హక్కుల అంశం ఎక్కడ ఉందని నిలదీశారు. ఈ వ్యాఖ్యలతో మరో జడ్జి జస్టిస్ వివేక్ శరణ్ విభేదించారు. కోర్టులో ఎన్‌హెచ్‌ఆర్సీ వాదనలు వినకుండానే దానిపై ఏకపక్షంగా వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ తర్వాత ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.





