
0views
అమెరికాకి చెందిన ముగ్గురు జాతీయులపై పూణె పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంటూ, అలాగే పర్యాటక వీసాల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆముగ్గురికీ పూణె పోలీసులు ‘‘లీవ్ ఇండియా నోటీసు’’ జారీ చేశారు.పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 19 నుంచి 21 వ తేదీ వరకూ పర్యాటక వీసాలపై భారత్ కి వచ్చారని, వారు ఇంగ్లీష్, హిందీ, మరాఠీకి చెందిన కరపత్రాలతో అక్రమంగా మత ప్రచారం చేస్తున్నట్లు కనిపించారని పేర్కొన్నారు.
అలాగే శుక్రవార్ పేఠ్ ప్రాంతంలో ఓ క్యాబ్ డ్రైవర్ ను సంప్రదించి, ఆ ముగ్గురూ అతనికి కరపత్రాలను పంచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముగ్గురిపై అనుమానం రావడంతో డ్రైవర్, సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ముగ్గురు విదేశీయులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా, మతపరమైన సందేశాలకు సంబంధించిన కరపత్రాలను భారీ సంఖ్యలో కనుగొన్నారు.వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిజానికి పర్యాటక వీసా కింద వచ్చే వారు మత పరమైన కార్యక్రమాలలో పాల్గొనడం నిషేధం, చట్ట వ్యతిరేకమైన చర్య. పూణే పోలీసుల విదేశీయుల నమోదు కార్యాలయం విచారణ చేయగా, టూరిస్టు వీసాల కింద వచ్చి, మత ప్రచారం చేస్తున్నట్లు తేలింది. వెంటనే ‘‘లీవ్ ఇండియా నోటీసు’’ ను జారీ చేశారు. ఆ ముగ్గురినీ మే 10, 2026 లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించారు.





