News

షెహబాజ్ షరీఫుకు కొత్త పేరు కావలెను!

254views

కశ్మీర్ మొత్తం మనదే అని పదే పదే అబద్ధాలు చెప్పకపోతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ ఉండదు. భారత్ను తక్కువ చేసి చూపిస్తేనే వాళ్లు పదవులలో ఉండగలరు. దేనికైనా భారత్తో తూకం వేసుకోవడం కూడా ఆ మతోన్మాద దేశానికి మామూలే. అందుకు తాజా ఉదాహరణ ఇది.

ఫిబ్రవరి 22న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక సవాలు విసిరాడు. ఆ సవాలును కనుక నెరవేర్చకపోతే నా పేరు షెహబాజే కాదు అని కూడా చెప్పాడు. ఇక అత్యవసరంగా అతడి కోసం ఓ కొత్త పేరు వెతక్క తప్పదు. ఎందుకంటే, ‘మనం భారత్ను అభివృద్ధి విషయంలో వెనక్కి నెట్టకపోతే నా పేరు షెహబాజ్ షరీఫ్ కాదు. మనం భారతదేశాన్ని అధిగమించి గొప్ప దేశంగా అవతరించేస్తున్నాం!’ అని ప్రగల్భించాడు. డేరా ఘాజీ ఖాన్ అనే చోట కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తూ షెహబాజ్ ఈ సవాలు విసిరాడు. షెహబాజ్ ప్రసంగాన్ని, సవాలుని కొన్ని పాకిస్తాన్ పత్రికలు నిజమని నమ్మినట్టే ఉంది. పాకిస్తాన్కు గొప్ప భవిష్యత్తు కలదని మన ప్రధాని పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారనీ, గొప్ప లక్ష్యాన్ని సాధించడానికే ఆయన పాటు పడతున్నారనీ, సిరిసంపదలతో తులతూగే పాకిస్తాన్ నిర్మాణానికి ఆయన శపథం చేశాడనీ రాశాయి. అయితే షెహబాజ్ తన పథకానికి కాలక్రమణిక ఏదీ చూపలేదు.

భారత్ను అధిగమించడం ఒక్కటే కాదట. తన నాయకత్వంలో పాకిస్తాన్ అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు నిలబడ కుండా స్వయం సమృద్ధ ఆర్థికవ్యవస్థ కలిగిన దేశంగా నిర్మాణం కావడం మీద దృష్టి కేంద్రీకరిస్తుందట. అలాగే దేశం అభివృద్ధి వైపు తన ప్రయాణం ఇప్పటికే ప్రారంభించిందని కూడా చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని చూడండి, మేం అధికారంలోకి వచ్చినప్పుడు 40 శాతం ఉంటే, ఇప్పుడు కేవలం 2 శాతానికి పడిపోయిందని ప్రజలని ఉద్దేశించి చెప్పాడు షెహబాజ్. దీనికి అటు పాకిస్తాన్, ఇటు భారత్కు చెందిన సామాజిక మాధ్యమాలు తమదైన శైలిలో స్పందించాయి. కొందరు షెహబాజ్ ప్రకటనతో తమకు స్పృహ తప్పినంత పనైందని వ్యాఖ్యానించారు. ఇంకాస్త చురుకుగా ఉండేవాళ్లు, షెహబాజి కి కొత్త పేరు వెతకవలసిందేనని ఎక్స్ ఖాతాలలో పోస్టులు పెట్టారు. కొందరు షెహబాజ్కి శ్రమ లేకుండా వాళ్లే కొత్త పేర్లు సూచించారు.

అన్నట్టు ఈ మధ్యనే షెహబాజ్ నోటి నుంచి మళ్లీ శాంతిమంత్రం వచ్చింది. భారత్ శాంతియుత వాతావరణంలో చర్చల జరపాలని పాకిస్తాన్కు ఉందట. కశ్మీర్ సహా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆ దేశం ఉవ్విళ్లూరుతున్న దట. అయితే ఈ మాటలన్నీ షెహబాజ్ ఆక్రమిత కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా ఆ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చెప్పడమే వింత.