News

గోవుల అక్రమ తరలింపు అడ్డగింత

18views

 ఎండాకాలంలో, గాలి ఆడని స్థితిలో కంటైనర్‌లో ఆవులు, ఎద్దులను కర్కశంగా తరలిస్తున్న లారీని   కర్నూలు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ సభ్యులు అడ్డుకున్నారు. వివరాలు.. షాద్‌నగర్‌ నుంచి బెంగళూరు, కర్ణాటకకు కంటైనర్లలో అక్రమంగా ఆవులు, ఎద్దులు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ సభ్యులు హైవే–44పై కాపు కాశారు. ఉలిందకొండ సమీపంలో రెండు కంటైనర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆపకపోవడంతో వెంట పడి వెల్దుర్తి హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఓ కంటైనర్‌ను ఆపగలిగారు. డోర్లు మూసివేసి, గాలి తగలని స్థితిలో కంటైనర్‌లో 40 వరకు ఆవులు, ఎద్దులను కట్టిపడేసి ఉంచడం చూసి సమీప పోలీసులకు సమాచారం అందించారు. మండు వేసవిలో ఊపిరాడని స్థితిలో ఉన్న మూగజీవాలను చూసి వారు ఆగ్రహించారు. సీఐ యుగంధర్‌ కంటైనర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, పరిశీలించారు. లారీ పత్రాలు, తరలింపు పత్రాలు సైతం సరిగా లేకపోవడంపై ఆవులు, ఎద్దులను కర్నూలు గోశాలకు తరలించారు. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా భజరంగ్‌ దళ్‌ సభ్యులు మాట్లాడుతూ.. దాదాపు 10 కంటైనర్లలో ఒకే నంబర్‌ ప్లేట్‌తో అక్రమంగా ఆవులు, ఎద్దులను ప్రమాదకర పరిస్థితులలో తరలిస్తున్నట్లు ఆరోపించారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.