News

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!

399views

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు తెలపారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం భద్రతాబలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. గాలింపు ప్రక్రియలో భాగంగా భద్రతా బలగాలకు చెందిన ఓ శునకం తీవ్రంగా గాయపడింది. ఇళ్ళ‌లో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్‌ అనే శునకాన్ని ఈ తరహా ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

శునకాన్ని చూసిన ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరపడం వల్ల అది తీవ్రంగా గాయపడిందని.. అయినప్పటికీ ఎంతో ఉపయోగపడిందని వివరించారు. దాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి