News

పోలీసుల అదుపులో బంగ్లాదేశీ దొంగల ముఠా

430views

* దేశవ్యాప్తంగా పలు ఏటీఎంలలో దొంగతనాలు

* చివరికి విజయవాడలో పట్టివేత

భారత్ ‌లో చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ‌లోని ఖుల్ నా రాష్ట్రం భాగర్‌ జిల్లాకు చెందిన షేక్‌ నదీమ్ ‌ఖాన్‌, ఎమ్ ‌డీ జహంగీర్‌, రండా సైమన్‌, అమర్ ‌గాసియా బాద్ ‌షా, శరణ్ ‌సింగ్‌ సుమన్‌, రండా కోకోన్ ‌ముల్లా, రఫీక్‌ ట్రక్కు డ్రైవర్లుగా, టీ దుకాణదారులుగా జీవనం సాగిస్తుంటారు. వీరికి సుమారు 30-35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. వీరందరూ ముఠాగా ఏర్పడి వివిధ మార్గాల్లో భారత్ ‌లోకి ప్రవేశించి బ్యాంకు ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరికి కోల్ ‌కతాకు చెందిన రాజు అనే వ్యక్తి తోడయ్యాడు. రండా సైమన్‌ నేతృత్వంలో ఈ ముఠా ఏటీఎంలో చోరీలకు పాల్పడి, ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి తిరిగి బంగ్లాదేశ్ ‌కు వెళ్లిపోతుంటారు. ఇప్పటివరకు ఢిల్లీ, ఒడిశాలోని భువనేశ్వర్‌, బెంగళూరులోని మదనాయనహళ్లి, గోవాలలో చోరీలు చేశారు. గత ఏప్రిల్‌ నెలలో భువనేశ్వర్‌లో ఏటీఎంలో దొంగతనం చేసి రూ.9 లక్షలతో పరారవడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బెంగళూరు జిల్లా మదనాయనహళ్లిలో మరో రూ.12 లక్షలు చోరీకి పాల్పడ్డారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన ఒడిశా పోలీసులు మదనాయనహళ్లిలో నిందితులు రండా కోకోన్ ‌ముల్లా, కోల్ ‌కతాకు చెందిన రాజును అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు తిరిగి బంగ్లాదేశ్ ‌కు వెళ్లారు. వారిలో రాఫిక్‌ అక్కడే నిలిచిపోగా సహీన్‌ అనే కొత్త వ్యక్తిని చేర్చుకున్నారు. ఈ నెల 10న ఏడుగురు విజయవాడ రైల్వేస్టేషన్ ‌కు చేరుకున్నారు. నగర పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన ముఠా స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండటంతో 14న గోవా బయలుదేరి వెళ్లారు. అక్కడ మరో రూ.15 లక్షలు ఏటీఎంలలో చోరీ చేసి, 19న విజయవాడ చేరుకుని అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి 21న గన్నవరం చేరుకున్నారు.

ఇదిలా ఉండగా గన్నవరం దుర్గా ట్రేడర్స్‌ యజమాని తన ట్రక్కు చోరీకి గురైనట్లు 21న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసుల్లో బీట్‌ కానిస్టేబుల్‌ మణీంద్రకుమార్‌ సినిమా హాళ్ల కూడలి సమీపంలో ఓ ట్రక్కు ఉండటాన్ని గమనించారు. అప్పటికే అక్కడికి దగ్గరలోని ఎస్ ‌బీఐ ఏటీఎంలో ముఠా సభ్యులు చోరీకి పాల్పడేందుకు యత్నిస్తుండటం చూశారు. అక్కడికి వెళుతుండగా బయట నిల్చొన్న వ్యక్తి అప్రమత్తం చేయడంతో అందరూ కలిసి పొట్లూరి హోటల్‌ మీదుగా శ్రీనగర్‌ కాలనీ వైపునకు పరుగులు తీశారు. వెంబడించిన మణీంద్ర, ముఠాలోని మహ్మద్‌ నదీమ్ ‌ఖాన్‌ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతను మణీంద్ర చేతిని కొరకడంతో పాటు చితకబాదినా వదల్లేదు. అనంతరం సమాచారం అందుకున్న స్టేషన్‌ సిబ్బంది నిందితుడిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఐదుగురిలో గస్తీ పోలీసులు మహమ్మద్‌ జహంగీర్‌ అనే మరో నిందితుడిని కొత్తపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.03 లక్షల నగదు, హెచ్‌ఎంటీ గడియారం, రూ.3.20 లక్షల విలువచేసే ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

అనుమానం రాకుండా దొంగతనాలు

ముఠా ఎక్కడికి వెళ్లినా తొలుత ఓ ఆటోనో, ట్రక్కునో చోరీ చేస్తారు. స్థానికంగానే ఏటీఎమ్ ‌ను బద్ధలు కొట్టేందుకు ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తారు. ఏటీఎంలోకి ప్రవేశించిన తర్వాత తొలుత సెన్సార్‌ వైర్లు, సీసీ కెమెరా, ఇతర వైర్లను కట్‌ చేస్తారు. తర్వాత చోరీకి పాల్పడిన సొమ్ముతో వెంట తెచ్చుకున్న ట్రక్కు, ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిపోయి పంచుకుంటారు. ఇప్పటివరకు ఇదే తరహాలోనే ముఠా చోరీలు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.