భారత్ తొలిసారి ‘తైవాన్ జలసంధి సైనికీకరణ’ అంశాన్ని ప్రస్తావించింది. భారత్ సాధారణంగా తైవాన్ పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్ పర్యటన అనంతరం చైనా యుద్ధవిన్యాసాలు చేయడం వంటి పరిణామాలపై భారత్ మరింత స్పష్టంగా తన వైఖరి తెలిపినట్లైంది.
ఈ నెల మొదట్లో విదేశీ వ్యవహారాల శాఖ ఈ జలసంధి పరిస్థితిపై విడుదల చేసిన ప్రకటనలో ”సైనికీకరణ” అనే పదం వినియోగించలేదు. ”ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలు ఆదోళనకరం” అని పేర్కొంది. అంతేకాదు ”ఇరుపక్షాలు సంయమనం పాటించాలని.. ఏకపక్షంగా యథాతథ పరిస్థితులను మార్చకూడదని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని, ఈ ప్రదేశంలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు కృషి చేయాలని కోరుతున్నాం” అంటూ భారత్ ఆగస్టు 12వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఏక చైనా విధానాన్ని’ భారత్ పునరుద్ఘాటించాలని అప్పట్లో బీజింగ్ కోరింది. కానీ, దీనికి భారత్ విదేశాంగ శాఖ నుంచి అస్పష్టమైన సమాధానం వచ్చింది. ”భారత్ విధానాలు తెలిసినవే. అవి సుస్థిరంగా ఉంటాయి.. వాటిని పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు” అని పేర్కొంది.
తాజాగా ‘తైవాన్’ ప్రస్తావన తీసుకురావడానికి చైనానే ఓ రకంగా కారణమైంది. ఇటీవల శ్రీలంకలోని హంబన్‌టోట రేవుకు చైనాకు చెందిన యువాన్ వాంగ్-5 నౌక రావడం వివాదానికి కారణమైంది. కొలంబోకు న్యూదిల్లీ నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీనిపై శ్రీలంకలోని చైనా దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఉత్తరాన ఉన్న పొరుగు దేశం నుంచి శ్రీలంక తీవ్ర ఒత్తిడికి గురైంది” అని పేర్కొన్నారు. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం తీవ్రంగా స్పందిస్తూ.. ప్రాథమిక దౌత్య మర్యాదలను చైనా ఉల్లంఘించిందని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ”తైవాన్ జలసంధి సైనికీకరణకు, యువాన్ వాంగ్-5 నౌక హంబన్‌టోటాకు రావడానికి సంబంధాలు అంటగడుతూ చైనా రాయబారి రాసిన కథనానికి స్పందనగా ఈ ట్వీట్ చేస్తున్నాం” అని పేర్కొంది.