News

తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం

580views
  • “ఆంగ్లేయుల ఏలుబడి – అంతులేని దోపిడి” పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో వ‌క్త‌లు

నంద్యాల: స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వాల సందర్భంగా “ఆంగ్లేయులు ఏలుబడి – అంతులేని దోపిడి” పుస్తక పరిచయం కార్యక్రమం సోమ‌వారం విజ్ఞాన దాయకంగా జరిగింది. శ్రీ రామకృష్ణ సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన కొలువుదీరిన సభ ఆహుతులతో కళకళలాడింది.

డాక్టర్ వడ్డి విజయసారథి, ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్యులు ఆంగ్లేయులు ఎన్ని విధాల మన దేశాన్ని దోచుకున్నారో వివరించారు. ఇదే విష‌యం “ఆంగ్లేయులు ఏలుబడి – అంతులేని దోపిడి” ఉంద‌న్నారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి మనం గతంలో చేసిన తప్పులను సవరించుకొని ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మన దేశాన్ని నిలపాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ పాత్రికేయుడు జనార్దన్ రెడ్డి సమీక్షిస్తూ పుస్తక రచయిత ఎన్నో పుస్తకాలు మధించి, ఏళ్ళ తరబడి అహోరాత్రులు శ్రమించి క్రోడీకరించి రాసిన ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా నిర్దేశించాలని యూజీసిపై ఒత్తిడి తేవాలని సూచించారు.

గ్రంథ‌ రచయిత డాక్టర్ సారంగపాణి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో చేయనన్ని దారుణాలు బ్రిటిష్ వారు మన దేశంలో చేశారని, ఇది అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రస్తావించాల్సిన అంశం అని తెలిపారు.

మన బంగారం, వెండి దోచుకెళ్ళి ధనవంతులై, బడ్జెట్లో లోటు చూపించి మన సొమ్ము తిరిగి మనకే వడ్డీకి ఇచ్చారని, అతి కిరాతకంగా పన్నులు వసూలు చేశారని, పన్నులు కట్టలేని పేదలను ఆడ, మగా తేడా లేకుండా బలవంతంగా తీసుకెళ్ళి బానిస వ్యాపారం చేశారని తెలిపారు.

1857 తిరుగుబాటు చేసిన వారిలో లక్షకు పైగా చంపగా పారిపోయిన వారిని ఓడ లెక్కించి బానిసలుగా అమ్మేశారని, రబ్బరు పరిశ్రమలో ఒప్పంద కార్మికులుగా పనిచేసేందుకు మగవారిని, వారికోసం వందకి 35 మంది చొప్పున ఆడవారిని బలవంతంగా ఎత్తుకెళ్ళారని వారు మరలా తిరిగి రాలేదని తెలిపారు. జాతీయ స్ఫూర్తినింపడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్న భావనతో పుస్తకాన్ని రచించామన్నారు. అంతర్గత పోరు మాని దేశానికి, ధర్మానికి అసలైన శత్రువులను గుర్తించి ఆ శత్రువుకు వ్యతిరేకంగా ఐక్యమై పోరాటాని కి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

 

తర్వాత సభికులు అడిగిన పలు ప్రశ్నలకు గ్రంథ రచయిత సమాధానమిచ్చారు. కాల్చినన్ని కాల్చి, ఎత్తుకెళ్ళినవి ఎత్తుకెళ్ళ గా ఇంకా పది లక్షలకు పైగా తాళపత్ర గ్రంథాలు కలిగి ఉన్న గొప్ప దేశం మనది. ఉక్కు పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమ, అంతరిక్ష విజ్ఞానం, ఆరోగ్య విద్య, కచ్చితమైన కాలగణన లాంటి ఎన్నో అధునాతన విద్యలు మన సొంతమ‌న్నారు. అనంత‌రం సమరసత సేవా ఫౌండేషన్ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ సారంగపాణిని ఘనంగా సన్మానించారు. అలాగే, వ‌డ్డి విజయ సారథి, జనార్దన్ రెడ్డిని జాతీయ సాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యులు ఘ‌నంగా స‌త్క‌రించారు.

ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా శ్రోతలు పాల్గొనడం విశేషం. పట్టణ ప్రముఖులు డాక్టర్ సహదేవుడు, వై.ఎన్‌. విష్ణువర్ధన్ రెడ్డి, సుధాకర్, రమేష్ బాబు, డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, సమరసత సేవ ఫౌండేషన్ కార్యకర్తలు రాం ప్రసాద్, చింతలపల్లె వాసు, నరసింహారాజు, శ్రీనివాసులు, రామనరసింహులు, శివప్రసాద్, అన్నెం శ్రీనివాస రెడ్డి, శేష ఫణి , కళాశాల విద్యార్థుల తో పాటు ఎంతో మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు.

ఒక్క కరపత్రం ముద్రించకుండా….

ఈ బృహత్ కార్యక్రమాన్ని సంకల్పించి, సమన్వయ పరిచి, కేవలం సామాజిక మాద్యమాల బలంతోనే ఆడిటోరియం ఆహుతులతో కిటకిటలాడేలా చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన డాక్టర్ ఉదయ్ శంకరికి, పరివార క్షేత్రాల కార్యకర్తలకు మాతృభాషా పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి డాక్టర్ రామ్మోహన్ శర్మ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. జనగణమన, శాంతిపాఠంతో సభ సుసంపన్నమైనది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి