News

అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం

462views

చింత‌ప‌ల్లి: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని, అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా అన్నారు.

గిరిజనులు ఎక్కడున్నా తమ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కు తగ్గరని అటువంటి వీరుల వంశం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేసేందుకు విప్లవ మార్గంలో ప్రజల్లో చైతన్యం రగిలించారని కొనియాడారు.

అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతాబ్ది ఉత్సవంలో మరో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు.

అనంతరం, అల్లూరి అతని అనుచరులు మొట్టమొదటగా దాడిచేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అల్లూరి ప్రధాన అనుచరుడైన స్వాతంత్య్ర‌ సమరయోధుడు గంటం దొరకు సంబంధించిన 11 కుటుంబాలకు పక్కా ఇళ్ల పట్టాలను అందజేశారు.

మన్యం వీరుడి శౌర్యగాథలను ప్రస్తావిస్తూ డాక్టర్ కర్నం సత్యనారాయణ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. ఆదివాసీల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని అర్జున్‌ ముండా వివరించారు. చింతపల్లి ప్రాంతాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేసి స్థానిక యువత ఉపాధి కల్పనకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి