
గో ప్రేమికులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో భజరంగ్ దళ్ నాయకులు కోరగా.. న్యాయసలహా తీసుకొని సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంతకీ సాయి పల్లవి ఏమన్నారంటే?
తాను ప్రధాన పాత్ర పోషించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్.. సాయి పల్లవి నేపథ్యం గురించి ప్రశ్నించగా ఆమె స్పందించారు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్ గా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి మాట్లాడారు. ”90ల్లో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో ఆ చిత్రంలో చూపించారు కదా? కోవిడ్ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించారు. దాని డ్రైవర్ ఓ ముస్లిం. కొంతమంది అతడిని కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది? మనం మంచిగా ఉండాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు” అంటూ సాయిపల్లవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయిపల్లవి గో రక్షకులను, కాశ్మీరీ ఉగ్రవాదులను ఒకే గాటన కట్టి మాట్లాడటాన్ని హిందూత్వ వాదులు తప్పుపడుతున్నారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





