News

బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

419views

బెంగ‌ళూరు: ఆధ్యాత్మిక భావనలను పురిగొల్పే పవిత్ర దేవాలయాలు హిందూతత్వానికి ప్రతీకలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. బెంగళూరులో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ‘రాజాధిరాజ గోవింద’ దేవస్థానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేవాలయాలు కళలు, భాషలు, జ్ఞానసంస్కృతి, నిర్మాణ సౌందర్యాన్ని ఒకేచోటుకు చేర్చే పవిత్ర స్థలాలని విశ్లేషించారు. మునుల తపస్సు, రాజుల పోషణ, వేద పండితులు, కవుల ఆరాధనలతో నిర్మించిన దేవాలయాలు భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యానికి సజీవ సాక్ష్యాలన్నారు.

భగవద్గీతలోని ఆధ్యాత్మిక సారాన్ని వాడవాడలా ప్రచారం చేస్తూనే, సామాజిక సేవలను కొనసాగించిన శ్రీ ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్‌ సంస్థ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల ఆకలిని తీర్చిందని గుర్తుచేశారు. కేవలం 12 ఏళ్లలోనే హరేకృష్ణ మంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వందకు పైగా కృష్ణ దేవాలయాల నిర్మాణం, అంతర్జాతీయ స్థాయిలో సమైక్యతను నెలకొల్పారని కితాబిచ్చారు. విద్య, సామాజిక, ఆధ్యాత్మిక సేవలు మానవతను చాటే కార్యక్రమాలని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్‌, కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ఇస్కాన్‌ బెంగళూరు విభాగ అధ్యక్షుడు మధుపండిత్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి