
-
ప్రథమ వర్ష సంఘశిక్షావర్గ సార్వజనికోత్సవంలో ఆర్.ఎస్.ఎస్ ఆంధ్ర ప్రాంత కార్యవాహ వేణుగోపాలనాయుడు
నూతక్కి: భారతీయ ఆత్మను జాగృతపరిచి తద్వారా దేశంలో స్వభాష, స్వభిమానం, స్వదేశీ భావన తదితర వాటిని శక్తివంతం చేసి, ప్రపంచంలో భారతదేశం గొప్ప గడ్డగా తయారు చేయడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) ధ్యేయమని ప్రాంత కార్యవాహ ఎ.వేణుగోపాలనాయుడు అన్నారు. సంఘం చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాల్లో సమాజం తనంతటతానే పాలుపంచుకుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండం నూతక్కి విజ్ఞాన విహార హై స్కూల్‌లో శుక్రవారం సాయంత్రం ప్రథమ వర్ష సంఘశిక్షావర్గ సార్వజనికోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి వేణుగోపాలనాయుడు ప్రధాన వక్తగా హాజరై, మాట్లాడారు. 21 రోజులపాటు ఒకే చోట జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారని, హోదాలు, స్థాయిలు మరిచి అంతా సోదరభావంతో మెలిగి, మనమంతా ఒకటేనన్న భావనతో ఆనందంగా శిక్షావర్గ పూర్తిచేసుకోవడం గొప్ప విషయమని అన్నారు.

సంఘం ప్రారంభమైన తొలినాళ్ళలో శాఖకు గాంధీ విచ్చేశారని, మాటల సందర్భంగా ఇక్కడున్న వారిలో హరిజనులు ఎంతమందని ప్రశ్నించగా, అక్కడున్న స్వయంసేవకులు ఇక్కడ అంతా హిందువులేనని, ఎవరికీ ఏ కులమేమిటో తెలియదన్నారు. దీంతో గాంధీ ఎంతో ఆనందపడి అభినందించారన్నారు. సంఘంలో కుల, మత బేధాలు ఉండవని, సమాజానికి కావాల్సింది చేసుకుపోవడమే ఆర్.ఎస్.ఎస్ పని అని తెలిపారు. కరోనా వల్ల శాఖలు, శిక్షావర్గలు నిలిచిపోయాయని, అయితే ఇప్పుడు అయిదు ప్రాంతాల్లో శిక్షా వర్గలు జరుగుతున్నాయన్నారు.







సంఘం స్థాపించి 97 ఏళ్ళు అవుతోందని తరలోనే శత వసంతాలు జరపుకోనుందన్నారు. ఈ తరుణంలో సంఘం సమాజంలో మరింతగా మమేకమై మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనుందన్నారు. సంఘం పని ఒక్కటేనని… అదే వ్యక్తి నిర్మాణం, కార్యకర్తల నిర్మాణమని వివరించారు. భరతమాత విముక్తి కోసం సంఘ కార్యకర్తలు కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, ఎంతో మంది జైలు పాలయ్యారని తెలిపారు. సమాజానికి లేదా దేశానికి ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను సంఘం చేపడుతుందని, సమాజ ఉద్ధరణే సంఘం లక్ష్యమన్నారు. అయితే, కొన్నిసార్లు మనం సంధియుగంలో ఉన్నామా అనిపిస్తోందని వేణుగోపాలనాయుడు అన్నారు.
ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి భారతదేశంలో ఉందని, ఈ యువశక్తే భారతదేశం పూర్వవైభవం సాధించడంలో కీలకమవుతుందన్నారు. దేశం రాబోయే రెండు, మూడేళ్ళలో సంపూర్ణ ఆర్థిక పరిపుష్టిని సాధించగలుతుందని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సివుందన్నారు. హిందూ సమాజం చైతన్యవంతమై అయోధ్యలో శ్రీరాముడి మందిరాన్ని నిర్మించుకుంటుందని, మందిర నిర్మాణానికి అవసరమైన నిధి సేకరణలో భారతీయ సమాజం స్వయంగా భాగస్వామ్యం అయిందన్నారు. ఈ కదలిక భారతజాతి ఐక్యమత్యంగా ఉందన్న సంగతిని లోకానికి చాటిందని తెలిపారు. అయితే, దేశంలో అక్కడక్కడా జాతి వ్యతిరేక శక్తులు భారతీయుల సహనాన్ని పరీక్షిస్తున్నాయని, అధర్మాన్ని ఎన్నుకున్న వాటికి ఎన్నటికీ విజయం ఉండదని వేణుగోపాలనాయుడు అన్నారు.
ఆంధ్రాలో కోనసీమ ప్రాంతానికి డాక్టర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడంలో తప్పులేదంటూ అంబేద్కర్ కీర్తిని గుర్తిస్తూ సామాజిక సమరసతా వేదిక వైపునుంచి ప్రకటన విడుదల చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ స్థాయిలో రైతు పోరాటాలంటూ స్వార్థపర శక్తులు సమాజాన్ని పెడతోవ పట్టిస్తున్నాయని తెలిపారు. హిందూ జాతిని మరింతగా మేల్కొపేందుకు ఆంధ్రాలో గోదావరి సంగమం, హిందూ శంఖారావం వంటి కార్యక్రమాలను సంఘం చేపట్టందని, వీటిని సమాజం స్వాగతించిందన్నారు.
ఉత్తమ గ్రామాల కోసం గ్రామ వికాస్ వేదిక, పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు, సంస్కృతీసంప్రదాయాలు, తెలిసోతెలియకో స్వధర్మం వీడిన వారి కోసం పునరాగమనం, తదితర విశేష వ్యవస్థలను సంఘం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 200 గ్రామాల్లో గ్రామ వికాస్ వేదిక పనులు ఫలితాలు ఇచ్చాయని, మరో 700 గ్రామాల్లో ఈ ఫలితాలు రానున్నాయన్నారు. ప్రపంచంలోని పెద్ద దేశాలకు శక్తి ఉన్నప్పటికీ యుద్ధాలను నిలుపలేకపోతున్నాయి సరికదా.. మరింతగా ఆజ్యం పోస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో భారతదేశం ఎవరివైపు మొగ్గుచూపక శాంతి దేశంగా పేరు గడించిందన్నారు. భవిష్యత్‌లో ప్రపంచంలో అత్యంత శక్తివంత దేశంగాను, ప్రపంచానికి జగద్గురుగాను భారతావని నిలువనుందని వేణుగోపాలనాయుడు అన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త గోకరాజు రామరాజు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవాలంటే దేశంలో హిందూ సంఘటన ఒక్కటే మార్గమని డాక్టర్ హెడ్గేవర్ గ్రహించారన్నారు. ఈ ధ్యేయంతోనే సంఘాన్ని స్థాపించారన్నారు. ఆ మార్గాన్ని నేటి సమాజం ఎంచుకుని ధర్మాన్ని రక్షిస్తుందన్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరికీ శిక్షావర్గలు ఎంతో అవసరమని తెలిపారు. 21 రోజులపాటు ఉపాధ్యాయులు, వ్యాపారులు, రోజు కూలీలు.. ఇలా ఎంతో మంది ఒకచోట ఉంటూ శిక్షణలో గొప్ప విషయాలు తెలుసుకున్నారన్నారు. కొద్దిరోజులపాటు శిక్షణ పొంది, ఎంతో చక్కగా వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చారన్నారు. మా కుటుంబానికి సంఘంతో అనుబంధం ఉందని, ఇకనుంచి తాను విరివిగా భరతమాత సేవలో పాలుపంచుకుంటానని ప్రకటించారు.
మరో ముఖ్యఅతిథి, మైలేష్ మెరైన్ ఎక్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఆపదల సమయంలో సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు అమోఘమని… తాను ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజం రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షార్థులు ప్రదర్శించిన శారీరక ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి.
దక్షిణ మధ్యక్షేత్ర సంఘచాలకులు నాగరాజు, ప్రాంత సంఘచాలకులు హరికుమార్ రెడ్డి, రిటైర్డు జడ్జి, కర్నూలు విభాగ్ సంపర్క ప్రముఖ్ కాశీభట్ల శివప్రసాద్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్స్టు ఇంజనీర్ శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ శిక్షావర్గలో మొత్తం 325 మంది పాల్గొన్నారు. కళాశాల, హైస్కూల్ బోధనా సిబ్బంది, విద్యార్థులు, రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్, రోజుకూలీలు, లాయర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.





