News

కశ్మీర్​ భారత్​లో అంతర్భాగమే… పాక్​ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​!

432views

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్తాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావాల్​ భుట్టో. దీనిపై భారత్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్ భారత్​లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్​ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటోందని మండిపడింది.

తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్ళిన భుట్టో గురువారం మీడియాతో మాట్లాడారు. గోధుమ ఎగుమతులపై భారత్​ నిషేధం విధించడంపై ఆయన స్పందించారు. అది భారత ప్రభుత్వ అంతర్గత నిర్ణయమని.. కానీ, ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సంస్థలను నిరుత్సాపరుస్తాయన్నారు. ఆహార భద్రత లక్ష్యాలను చేరుకోలేని వారి అవసరాలను తీర్చేందుకు మన మందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కశ్మీర్​ భారత్​లో అంతర్భాగం

పాకిస్తాన్ ప్రతి వేదికను భారత్​కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటుందని భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ భద్రతా మండలి నిర్వహించిన ‘అంతర్జాతీయ శాంతి, ఆహార భద్రత’ అంశంపై చర్చలో భారత శాశ్వత కౌన్సిలర్​ రాజేశ్​ పరిహార్​ స్పందించారు.

‘కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​​.. భారత్​లో అంతర్భాగం. ఇందులో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఎన్ని విద్వేష పూర్వక ప్రసంగాలు చేసినా ఈ వాస్తవాన్ని కాదనలేరు. పాకిస్తాన్ చేయగల ఏకైక సహకారం.. వారు ప్రోత్సహించే ఉగ్రవాదాన్ని అరికట్టడమే’ ​అని అన్నారు.

ఆర్టికల్​ 370ని రద్దు చేయడం తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి భారత్ స్పష్టంగా చెప్పింది. జమ్ము కశ్మీర్​ భారత్​లో అంతర్భాగమన్న వాస్తవాన్ని అంగీకరించాలని.. భారత్​ వ్యతిరేక ప్రచారాలని మానుకోవాలని హితవు పలికింది. ఉగ్రవాదం, హింస లేని సంబంధాలను తాము కోరుకుంటున్నామని పాకిస్తాన్​కు తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి