
బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ పాస్టర్, ఆయన భార్య అరెస్టయ్యారు. వీరు కేరళలోని వయనాద్‌కు చెందినవారు. వీరు కాఫీ ఎస్టేట్స్‌లోని కూలీల మతాన్ని బలవంతంగా మార్చుతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
కొడగు జిల్లాలోని మంచల్లి గ్రామంలో పాస్టర్ కుర్యిచన్(62), ఆయన భార్య సలేనమ్మ(57) అక్రమంగా మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఓ హిందూ సంస్థ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాఫీ ఎస్టేట్స్‌లోని కూలీలను ప్రలోభాలకు గురి చేసి, వారి మతం మార్చుతున్నారని తెలిపారు.
పాస్టర్ ఇంటికి ఈ సంస్థ సభ్యులు వెళ్ళి, ఆయనను ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తున్న ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఎందరిని మతం మార్చారు? ఎంత సొమ్ము వసూలు చేశారు? మీ బ్యాంకు ఖాతాలు ఏవి? అని ఆ దంపతులను ప్రశ్నిస్తున్నట్టు కనిపించింది.
కుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాస్టర్ దంపతులపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 295(ఏ) ప్రకారం బుధవారం కేసు నమోదు చేశారు.
ఓ మతాన్ని అవమానిస్తూ, ఆ మతస్థుల మతపరమైన నమ్మకాలను అవమానిస్తూ, వారి మనోభావాలను భంగపరిచేవిధంగా ఉద్దేశపూర్వకంగా, విషపూరితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మత స్వేచ్ఛ హక్కు ఆర్డినెన్స్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ అయితే, దాని ప్రకారం కేసును నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. వివిధ పరిస్థితుల్లో మత మార్పిడులను నిరోధించాలనే లక్ష్యంతో ఈ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. సాధారణ వర్గాలకు చెందినవారిని ఈ ఆర్డినెన్స్‌ను ఉల్లంఘించి మతం మార్చితే, దోషికి మూడు నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలను ఈ ఆర్డినెన్స్‌ను ఉల్లంఘించి మతం మార్చితే మూడు నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు.





