
విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత, విశ్లేషకులు డాక్టర్ రతన్ శార్దా రచించిన “CONFLICT RESOLUTION – THE RSS WAY” అనే ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సాహితీ సుధ ఫౌండేషన్, సమాలోచనల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ రతన్ శార్దా, ప్రముఖ రచయిత డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు, రిటైర్డ్ IAS శ్రీ దాసరి శ్రీనివాసులు గార్లు పాల్గొన్నారు.
గ్రంధకర్త డాక్టర్ రతన్ శార్దా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, మేథావులు, పత్రికలు అన్నీ, అందరూ మన చరిత్రలోని సత్యాలను ఉద్దేశ్యపూర్వకంగా, వ్యూహాత్మకంగా మరుగుపరచారని, నేడు ఆ మరుగునపడ్డ సత్యాలను ఆధారసహితంగా వెలికితీసి, విశ్లేషించి ప్రజలకు అందించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్లోనూ మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ సందర్భాలలో హిందువులపై జరిగిన అనేక దాడుల వివరాలను తెలియజేశారు. ఇలాంటి చారిత్రిక సత్యాలను మేథావులు, మీడియా, ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే ఇన్నాళ్ళూ దాచాయని, తనలాంటి జాతీయవాద రచయితల కృషితో అనేక వాస్తవాలు ఈనాడు ప్రజలకు తెలుస్తున్నాయని అన్నారు. ఈ దిశలో మరింత విస్తృతమైన పరోశోధన, పరిశీలన, అధ్యయనం సాగించవలసిన అవసరం ఉన్నదని, మరింతమంది చరిత్ర పరిశోధకులు, చింతకులు, రచయితలు ఆ దిశగా ప్రయత్నించాలని, ముఖ్యంగా ఎక్కడికక్కడ స్థానిక చారిత్రిక పరిణామాలపై లోతైన అధ్యయనం జరగాలని, దశాబ్దాలుగా వివిధ అంశాలపై తమకు తోచిన రీతిలో కథనాలల్లుతూ, చరిత్రను, సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూ వచ్చినవారి కుట్రలను వెలికితీసి ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత జాతీయవాదులు, ముఖ్యంగా జాతీయవాద అధ్యయనకారులు, రచయితలపై ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

రచయిత డాక్టర్ రతన్ శార్దా
ఆరెస్సెస్ ముందుచూపు :
దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, రానున్న ప్రమాదాలను పసిగడుతూ, జరుగవలసిన పరిణామాలను వివరిస్తూ RSS ఎప్పటికప్పుడు తన తీర్మానాల రూపంలో ప్రభుత్వాలని, సమాజాన్ని హెచ్చరించే, జాగృతం చేసే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నదని ఆయన వెల్లడించారు. దురదృష్ట వశాత్తూ దేశంలోని ప్రభుత్వాలు, మీడియా వాటికి అంత ప్రాముఖ్యతను, ప్రచారాన్ని కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ… రతన్ శార్దా గారి రచనలు ఎంతో ప్రేరణదాయకంగా ఉంటాయని, ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి పుస్తకాల రూపంలో అందిస్తున్న డాక్టర్ రతన్ శార్దా అభినందనీయులని పేర్కొన్నారు. నిజానికి రతన్ శార్దా గారు చదివింది టెక్స్ టైల్ టెక్నాలజీ అయినా ఆయన చరిత్ర, సామాజిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలను తీసుకుని పుస్తక రచన చేయడం విశేషమని శ్రీ శ్రీనివాసులు ప్రశంసించారు.

రిటైర్డ్ IAS శ్రీ దాసరి శ్రీనివాసులు
అనంతరం ప్రముఖ రచయిత డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ రతన్ శార్దా గారు ప్రముఖ సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై విస్తృతమైన పరిశోధన చేశారని, వాటి ఆధారంగా RSS పై పలు పుస్తకాలను వెలువరించారని తెలిపారు. శ్రీ శార్దా గారు వెలువరించిన మొత్తం 12, 13 గ్రంధాలలో 7 పుస్తకాలు RSS పై రచించినవే కావడం గమనార్హమని, దీనిని బట్టే ఆయన RSS పై ఎంత లోతైన అధ్యయనం చేశారో అవగతమవుతుందని ఆయన తెలిపారు.

డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు
ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణీ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు, ఆరెస్సెస్ విజయవాడ మహానగర్ సంఘచాలక్ శ్రీ కృష్ణప్రసాద్, విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీ PVS నాయుడు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ శ్రీ ప్రసాదరావు, బీజేపీ నాయకులు శ్రీ సత్యమూర్తి, శ్రీమతి సాదినేని యామిని శర్మ, శ్రీ లంక దినకర్, శ్రీ చిగురుపాటి నరేశ్ లు రచయిత శ్రీ రతన్ శార్దా గారిని సన్మానించారు.


రచయిత గురించి :
“CONFLICT RESOLUTION – THE RSS WAY” గ్రంధ రచయిత డాక్టర్ రతన్ శార్దా గారు ముంబై నివాసి. టెక్స్ టైల్ టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీ శార్దా RSS పుట్టుక, ప్రస్థానం, విజయాలు, సర్ సంఘచాలకుల పరంపర వంటి అంశాలను పరిశోధనకు స్వీకరించి, దానిపై థీసిస్ సమర్పించి, డాక్టరేట్ సాధించారు. RSS 360, RSS EVOLUTION FROM AN ORGANISATION TO A MOVEMENT, SANGH & SWARAJ వంటి పలు పుస్తకాలను వెలువరించారు. వివిధ అంశాలపై నిరంతర పరిశోధన, అధ్యయనం, రచన కొనసాగిస్తున్నారు.





