
-
పాక్‌ను దేవుడు ఆశీర్వదించాలంటూ కర్ణాటక యువతి పోస్ట్
-
అరెస్టు చేసిన పోలీసులు
బెంగళూరు: పాకిస్థాన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వాట్సాప్ స్టాటస్‌లో పోస్టింగ్ పెట్టినందుకు కర్ణాటకకు చెందిన ఓ 25 ఏళ్ళ యువతి చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆ తర్వాత బెయిలుపై విడిచిపెట్టారు. ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా ముథోల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈనెల 23న పాక్ రిపబ్లిక్ డే జరిగింది.
ఈ సందర్భంగా కుథ్‌మా షేక్ ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ”శాంతి, ఐక్యత, సామరస్యం వెల్లివిరిసేలా ప్రతి దేశాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా” అని ఆమె తన మెసేజ్‌లో పేర్కొంది. శాంతి భద్రతల పరిస్థితిని కాపాడేందుకే షేక్‌ను అరెస్టు చేసి, బెయిలుపై విడిచిపెట్టినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ముథోల్ నివాసి అయిన షేక్…మదరసాలో సీనియర్ స్టూడెంట్. పాకిస్తాన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా రెండు వర్గాల మధ్య శత్రుత్వం సృష్టిస్తోందంటూ ఆమెపై అరుణ్ కుమార్ భజంత్రి అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. భజంత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు బాగల్కోట్ ఎస్‌పీ లోకేష్ భారమప్ప జగలసర్ చెప్పారు.





