
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరి పాకాన పడి ఘర్షణలు రేగిన కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులు ఎవరూ పాఠశాలకు వచ్చేటప్పుడు మతపరమైన దుస్తులను ధరించకూడదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలను ప్రేరేపించే హిజాబ్ కానీ, కాషాయ కండువాలను కానీ ధరించొద్దని తెలిపింది.
ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో ధరించే దుస్తులపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌఖికంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రసారం చేయొద్దని వార్తా సంస్థలకు స్పష్టం చేసింది. తుది ఆదేశాలు వచ్చేంత వరకు సంయమనంతో ఉండాలని సూచించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Source: EtvBharat





