-
సీమా జాగరణ మంచ్ అఖిలభారత సహా సంయోజక్(ప్రచారక్) మురళీధర్
తిరుపతి: సమ సమాజ నిర్మాణమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని సీమా జాగరణ మంచ్ అఖిలభారత సహా సంయోజక్(ప్రచారక్) మురళీధర్ అన్నారు. ఈ నెల అయిదు, ఆరు తేదీల్లో తిరుపతిలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మురళీధర్ ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) కార్యకర్తలను తయారు చేస్తుంది.. వివిధ క్షేత్రాలు సమాజంలో మార్పు కొరకు పనిచేస్తాయన్నారు.
గొప్ప సమాజ నిర్మాణం నిమిత్తం ముందుగానే రాబోయే మూడేళ్ళ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పర్యావరణం, స్వదేశీ ఆచరణ, ధర్మ జాగరణ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే, సమితి శక్తి కేంద్రాలను తయారు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ యుగంధర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. కాగా, రాబోయే మత్స్య జయంతి, మత్స్యనారాయణ స్వామి దీక్షకు సంబంధించి విషయాలపై చర్చించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, పేరుపాలెంలోని శ్రీ మత్స్యనారాయణ స్వామి దేవాలయ ధ్వజస్తంభం పోతకు కావలసిన ఇత్తడిని రాష్ట్రం అన్ని గ్రామాల నుంచి సేకరించాలని నిర్ణయించారు. యుగంధర్ 25 వేల రూపాయల చెక్కు సమర్పించారు. తదుపరి సభ్యులు వారి వారి జిల్లాల నుంచి 6,150 కిలోల ఇత్తడిని గ్రామాల్లో సేకరిస్తామని తెలిపారు. తాళ్ళపాలెం, కర్నూలు, కడప జిల్లా వారు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి పాల్గొని, ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారు కంకణం దారాలు, అమ్మవారి కుంకుమ, ప్రసాదం కార్యకర్తలకు పంపిణీ చేశారు. మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమెళ్ళ వాసు, జయరాం, రాష్ట్ర అధ్యక్షుడు కోలంగారి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి 13+2=15 జిల్లాల నుంచి 73 మంది పాల్గొన్నారు.