News

రాష్ట్రంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

489views

విజ‌య‌వాడ‌: రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జ‌రిగాయి. సూర్యనారాయణ స్వామి ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఆదిత్యాయ ఆరోగ్య ప్రదాయ అంటూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

తిరుమలలో సప్త వాహనాలపై స్వామివారు

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జ‌రిగాయి. ఇవాళ స్వామి వారు సప్తవాహనాలపై దర్శనమివ్వనుండగా.. ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం చినశేష వాహనం, గరుడ వాహన సేవలు, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు నిర్వహించారు.

మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో చక్రస్నానం నిర్వహించారు. రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. కొవిడ్‌ కారణంగా స్వామి వారి వాహన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా టీటీడీ అధికారులు పలు సేవలు రద్దు చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు.

అరసవిల్లిలో సూర్యనారాయణ మూర్తికి క్షీరాభిషేకం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని జయంత్యుత్సవం మొదలైంది. అర్థరాత్రి నుంచే అంగరంగ వైభోగంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన.. ఈసారి తొలి పూజ చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం, విశాఖ ఐజీ రంగారావు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటల వరకు స్వామి వారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరిగింది.

అనంతరం సూర్యనారాయణ స్వామి వారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం ఇస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పుష్పాలంకరణ సేవ, సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం స్వామివారికి ఏకాంతసేవ గావించి, పవలింపు సేవతో ఉత్సవం ముగిస్తోంది. టెక్కలిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలోనూ అర్ధరాత్రి నుంచే భక్తులు క్షీరాభిషేకాలు నిర్వస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి