
న్యూఢిల్లీ: భారత దేశంపై మరో కుట్ర జరిగింది. దీని ఫలితమే సరిహద్దుల్లో దాదాపు 135 ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేరకు బీఎస్‌ఎఫ్ కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి నక్కి ఉన్నారని, ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది గణతంత్ర వేడుకలే వీరి లక్ష్యంగా ఉన్నాయని రాజాబాబు సింగ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం నాడు ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నట్టు వచ్చిన హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో బలగాలను మోహరించినట్టు వివరించారు. అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ బీఎస్‌ఎఫ్ విస్తృతమైన యాంటీ టన్నెలింగ్ డ్రైవ్, ప్రత్యేక పెట్రోలింగ్, డెప్త్ ఏరియా డామినేషన్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితులు శాంతియుతంగానే ఉందన్నారు.
“దేశంలో చొరబడేందుకు ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో 104 నుంచి 135 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమచారం అందింది. కొందరు గైడ్‌లు నియంత్రణ రేఖ దాటి ఆ వైపునకు వెళ్లారు. వారు తిరిగి వచ్చినప్పుడు పర్యవేక్షిస్తాం. వారి కుటుంబాల కదలికల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది” అని బీఎస్‌ఎఫ్ ఐజీ పేర్కొన్నారు.
చొరబాట్లకు వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచినట్లు రాజాబాబు తెలిపారు. తాలిబన్లు చొరబడే ప్రమాదమున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ఇప్పటివరకు దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయినప్పటికీ గట్టి నిఘా ఉంచినట్టు పేర్కొన్నారు. డ్రోన్ ముప్పు ఉన్నట్టు తెలిపారు. “గతేడాది కూడా డ్రోన్లను గుర్తించాం. కానీ ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు. ఈ ఏడాది తగిన చర్యలు తీసుకుంటున్నాం. యాంటీ డ్రోన్ విధానాలతో ద్వారా సమర్థంగా ఎదుర్కొంటాం” అని రాజాబాబు చెప్పారు.
Source: EtvBharat





