
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సోమవారం నుండి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయమని కోరింది. నవంబర్ 17 వరకు నిర్మాణ కార్యకలాపాలను కూడా నిషేధించింది. అన్ని విద్యాసంస్థలు నవంబర్ 20 వరకు మూసివేశామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఢిల్లీలో డీజిల్ జనరేటర్ సెట్లు, బొగ్గు బట్టీలను మూసివేయాలని, పార్కింగ్ ఫీజులను పెంచాలని, కాలుష్యాన్ని తగ్గించడానికి మెట్రో, బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని కూడా ఆప్ ప్రభుత్వం సూచించింది. ఈ అన్ని అత్యవసర చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం నగరంలో వాహనాలు, ధూళి కాలుష్యాన్ని తగ్గించడమేనని రాయ్ చెప్పారు. నగరంలో దుమ్మును అరికట్టేందుకు 400 ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు. నాలుగు వేల ఎకరాల పొలాల్లో పొట్టు కుళ్లిపోకుండా బయో డీకంపోజర్ సొల్యూషన్స్ పిచికారీ చేసే పనిని ప్రభుత్వం నవంబర్ 20 నాటికి పూర్తి చేయనుంది.





