
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా గోమాతల కోసం అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్ట రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి తెలిపారు. యూపీ సర్కారు ప్రారంభించనున్న ఈ పథకం దేశంలోనే మొదటిదని మంత్రి తెలిపారు. మొత్తం 515 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు.
ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు, గోవుల ఎమర్జెన్సీ సర్వీసు నంబర్ ‘112’కు ఫోన్ చేయాలన్నారు. కాల్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోపు వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ ఇంటి దగ్గరకు వస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని, మథురతో సహా ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని మంత్రి వివరించారు.
Source: Tv9





