
-
ప్రత్యేక రైళ్ళు రద్దు
-
దేశంలో నడవనున్న సాధారణ రైళ్ళు
-
తక్షణమే ఉత్తర్వులు అమలు
న్యూఢిల్లీ: ప్రత్యేక రైళ్లు, వాటిపేరుతో వసూలు చేసే అధిక ఛార్జీలకు రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న విధంగానే రెగ్యులర్ రైళ్ళను అందుబాటులోకి తీసుకువచ్చి టికెట్ ధరలు తగ్గించనుందని పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నుంచి రైల్వేశాఖ కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది.
అనవసర ప్రయాణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఛార్జీలను కూడా పెంచింది. అయితే, పాతవాటినే ప్రత్యేక రైళ్ళుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ.. ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ముందున్న విధంగానే రైళ్ళ పేర్లు, నంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వేబోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖలు రాసింది.
అన్ని రైళ్ళు పట్టాలు ఎక్కడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ప్రత్యేక రైళ్ళ నంబరు సున్నాతో ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచి అది ఉండబోదని తెలిపారు. అయితే.. కరోనా కారణంగా రాయితీలు, బెడ్‌రోల్స్, భోజనాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు.





