
ఆఫ్ఘనిస్థాన్ తిరిగి వార్తల్లో నిలిచింది. వారి క్రికెట్ జట్టో, ఫుట్ బాల్ జట్టో అంతర్జాతీయంగా అద్భుతాలు సృష్టించినందుకు కాదు. దురదృష్టవశాత్తూ అక్కడ చోటు చేసుకున్న దుష్పరిణామాల వల్ల. పెద్ద ప్రతిఘటన ఏమీ ఎదురు కాకుండానే అత్యంత వేగంగా తాలిబాన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించుకోవడం అంతా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే మనకు కనిపిస్తూ ఉంది. ఈ పరిణామం యావత్ ప్రపంచాన్నీ విస్తుపోయేలా చేసింది. తనను తాను సూపర్ పవర్ గా భావించే అమెరికా 2002 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసమని 144. 98 బిలియన్ డాలర్ల సొమ్ములను ఖర్చు చేసింది. అలాగే సెక్యూరిటీ కోసమని 88.6 1 బిలియన్ డాలర్లు, పరిపాలన మరియు అభివృద్ధి కోసం 36.29 బిలియన్ డాలర్లు, మానవతా సాయం పేరిట 4.18 బిలియయన్ డాలర్లు, ఏజెన్సీ కార్యకలాపాల కోసం మరో 15.91 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఈ రెండు దశాబ్దాల కాల వ్యవధిలో ఆఫ్ఘన్ బడ్జెట్‌లో దాదాపు 80% అమెరికానే భరించింది. అమెరికా ఆర్ధిక సహాయం లేకుంటే తమ సైనికులకు తాము కనీసం ఆరు నెలల పాటు కూడా జీత భత్యాలను చెల్లించలేకపోయేవారమని సాక్షాత్తూ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీయే ఇంతకు ముందు బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కొన్ని విశ్లేషణల ప్రకారం ఆఫ్ఘన్ ప్రజల స్థిరమైన అభివృద్ధి కోసం, వారి పునరుజ్జీవనం కోసం ఖర్చు చేసిన కొంత మొత్తం మినహా దాదాపు 80% నిధులు US ఆర్థిక వ్యవస్థకు తిరిగి వెళ్లిపోయాయి. తాలిబన్ యొక్క క్రూరత్వాన్ని, సామర్థ్యాన్ని మరియు ఆఫ్ఘన్ సైన్యం యొక్క స్వాభావిక బలహీనతలను అంచనా వేయడంలో అమెరికన్ నాయకత్వం ఘోరంగా విఫలమైంది. యుఎస్, రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ సైన్యానికి శిక్షణనందిస్తూ వచ్చింది. అన్ని రకాలైన పరికరాలనూ అందించింది కూడా.

ప్రజలు తమ ఇళ్లు, ఆస్తులను విడిచిపెట్టి, ప్రాణాలుగ్గబట్టుకుని కాబూల్ విమానాశ్రయం వద్ద పరుగులు తీస్తున్న దృశ్యాలను మనం చూశాం. అలాగే తాలిబన్ ముష్కరులు కాబూల్ వీధుల్లో ఆయుధాలు పట్టి తిరుగుతూ ప్రజల్ని భయ కంపితుల్ని చేస్తున్న చిత్రాలను కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటి మధ్య ఆఫ్ఘనిస్థాన్ యొక్క అనిశ్చిత భవిష్యత్తు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతోంది. కాబూల్ మరియు అనేక నగరాల వీధులలో జరుగుతున్న తాలిబన్ల అనాగరిక చర్యల వీడియోలు అనేకం వెలువడ్డాయి. మీడియాలో చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఆ చర్చలు కొన్ని, రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆఫ్ఘన్ తిరుగుబాటుపై అనేక చారిత్రక కథనాలు వెలువడ్డాయి. మతం ఆధారంగా కూడా కొన్ని తొందరపాటు వివరణలు, విశ్లేషణలు నడిచాయి. మొత్తానికి ఆఫ్ఘన్ కు సంబంధించిన సమాచారం మీడియాలో వెల్లువెత్తింది.
1990 లలో ప్రచురితమైన పీటర్ హాప్‌క్రిక్ రాసిన “గ్రేట్ గేమ్: ఆన్ సీక్రెట్ సర్వీస్ ఇన్ హై ఆసియా” పుస్తకాన్ని చదివిన వారికి అప్పటి సామ్రాజ్యవాద శక్తులు… రష్యన్ సామ్రాజ్యం మరియు బ్రిటిష్ సామ్రాజ్యం రెండూ మధ్య ఆసియాపై పట్టు సాధించడం కోసం ఎలాంటి కుట్రలు,కుతంత్రాలకు పాల్పడ్డాయో అర్థమవుతుంది. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ పై ఆధిపత్యం చెలాయించడమనేది మొత్తం ఆసియాపై ఎలాంటి అడ్డంకులూ లేకుండా అధికారాన్నివిస్తరించడానికి, ఆ భూభాగంపై పట్టు సాధించటానికి వ్యూహాత్మకంగా వారికి అత్యంత కీలకమైన విషయం. అదేవిధంగా, భారతదేశంలో, ఎనిమిదవ శతాబ్దం నుండి మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యే వరకూ పాలన సాగించిన క్రూరమైన ఇస్లామిక్ ఆక్రమణదారుల మూలాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆఫ్ఘనిస్తాన్ లోనే మనకు కనిపిస్తాయి.
1504 లో వక్రబుద్ధికి, నిర్దాక్షిణ్య స్వభావానికి ప్రసిద్ధుడైన బాబర్, కాబూల్ ను స్వాధీనం చేసుకున్నాడు. తన వరుస దాడుల ద్వారా ఆఫ్ఘనిస్థాన్లో శతాబ్దాల తరబడి సాగిన అణచివేతకు పునాది వేశాడు. అతని అనాగరిక ఆశయ సాధనలో విజయం సాధించాడు. మరణశయ్యపైనుండగా బాబర్ కోరిన కోరిక మేరకు బాబర్ మృతదేహాన్ని ఆఫ్ఘనిస్థాన్ లోని ఒక కొండప్రక్కన ఖననం చేయడానికి భారత్ నుంచి కాబూల్ కు తీసుకెళ్లారు. ఇదీ… ఆఫ్ఘనిస్థాన్ కి భారతదేశంతో ఉన్న గొప్ప సంబంధం.
1980 లలో సోవియట్ దళాలతో పోరాడటానికి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI మరియు US ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA లు కలిసి సంయుక్తంగా తాలిబాన్ ను స్థాపించాయి. 1996 లో తాలిబన్ లు కాబూల్ ను స్వాధీనం చేసుకోవడం, మహిళలు, అమాయకులు, పసిపిల్లలపై దారుణమైన హింసకు పాల్పడడం, సిక్కులు, హిందువులు మరియు ఇతర మైనారిటీ మతస్థులపై అమానుషమైన ఆంక్షలు విధించడం, బమియాన్ వద్ద అత్యంత ఎత్తైన ఇసుకరాయి బౌద్ధ శిల్పాలను ధ్వంసం చేయడం, పురాతన వారసత్వ సంపదపై బుద్ధి హీనమైన దాడులు, విధ్వంసం ఇటీవలి చరిత్రలో మనమెరిగిన వాస్తవాలు.
2001 లో తాలిబన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోని రహస్య ప్రదేశం నుండి అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నిర్దేశించినట్లుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై అత్యంత కలవరపెట్టే రీతిలో జరిగిన ఉగ్ర దాడి తరువాత తాలిబన్ లు, యుఎస్ ప్రభుత్వాల సాహచర్యం ముగిసింది. అప్పుడు మొదలైన హోరాహోరీ పోరు ఇప్పుడిక ఆకస్మికంగా ముగిసింది. ఇప్పుడు, ఆఫ్ఘనిస్థాన్ లో దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి.
1990 ల నుంచి ఇప్పటి వరకూ తాలిబన్ అనేక అంశాలలో అసాధారణ మార్పులకు గురైంది. ఇప్పుడు ఆ తీవ్రవాద సమూహానికి భారీ ఆర్థిక వనరులున్నాయి. హింసాత్మక తిరుగుబాటులో దశాబ్దాల అనుభవం కలిగిన ప్రధాన శక్తిగా అది నేడు అవతరించింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు తాలిబన్ల నుంచి పొంచివున్న ముప్పును ఇకపై విస్మరించలేవు.
తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తన మొదటి ప్రెస్ మీట్‌లో తాము మహిళల హక్కులను గౌరవిస్తామని, గత ప్రభుత్వంలో పనిచేసిన వారిని క్షమిస్తామని, మీడియాకు స్వేచ్ఛనిస్తామని, ఉగ్రదాడులకు కేంద్రంగా, ఉగ్రవాదుల స్వర్గధామంగా తమ దేశం ఉండడాన్ని తాము అనుమతించబోమని ప్రకటించారు. ప్రపంచం ముందు తమను తాము సహృదయులుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ఆ విధంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించటానికి వారు చేసిన విఫల యత్నం మాత్రమే అది. జర్నలిస్టులను, జనాన్నివీధుల్లో కొట్టడం, గత ప్రభుత్వంతో జతకట్టిన వారి ఇళ్లపై దాడులు చెయ్యడం, మహిళా జర్నలిస్టులను ఉద్యోగాలు మాన్పించటం వంటి చర్యలు వారి ప్రకటనలకు, చర్యలకు మధ్య ఉన్న అంతరాన్ని తెలియజేస్తున్నాయి. వారి చర్యలు ఆఫ్ఘన్ ప్రజలలో మరింత భయాందోళనలను రేకెత్తించాయి. ప్రజలలో నెలకొన్న భయాలు సత్యదూరమైనవేమీ కాదని కూడా తాలిబన్ల చర్యలు ఋజువు చేస్తున్నాయి.
ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా షరియా చట్టం అమలవుతున్న కారణంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ లో ఏ విధమైన షరియా చట్టాన్ని అమలుచేయనున్నారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా మహిళల విషయంలో వారు ఏ విధంగా వ్యవహరించనున్నారన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
మధ్యయుగం నాటి షరియా యొక్క ప్రాథమిక లక్షణాలు కాలం చెల్లినవని, వారి పవిత్ర గ్రంథంలో సమానత్వం, న్యాయం, లౌకికవాదం వంటివాటిని అస్పష్టంగా నిర్వచించిన కారణంగా సమానత్వం, న్యాయం, లౌకికవాదాలపై నమ్మకమున్న ప్రస్తుత ఆధునిక న్యాయ వ్యవస్థలతో అవి సరిపోలడం లేదని దృఢంగా విశ్వసించే ఒక నిర్దిష్ట న్యాయశాస్త్ర పండితవర్గం ఒకటి ఉంది.
మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… తాలిబాన్ అనేది కూడా ప్రపంచ జిహాదీ ఉద్యమంలో భాగమే. తాలిబన్, అల్ ఖైదా, ISIS, బోకో హరామ్, హక్కానీ నెట్‌వర్క్, జైష్-ఇ-మహ్మద్, లష్కరే-ఇ-తైబా మరియు ఇతర తీవ్రవాద గుంపుల మధ్య మనకు కొన్ని విభేదాలు కనిపిస్తాయి. వారు పేరు కోసం పడే పోటీ కారణంగానే అప్పుడపుడూ కొన్ని విభేదాలున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి వారందరి లక్ష్యం ఒకటే. అది అత్యంత క్రూరమైనది, పైశాచికమైనది. తాము తాలిబన్ల అధీనంలో పనిచేస్తున్నామని, ముల్లా ఒమరే తమ నాయకుడని అల్ ఖైదా కూడా ఒక సందర్భంలో ప్రకటించి ఉండడం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా, అల్ ఖైదా యొక్క ప్రముఖ మతాధికారులలో ఒకరైన మామౌన్ హతేమ్ ఐసిస్ కు తిరుగులేని మద్దతు ప్రకటించారు. ఈ సమూహాలన్నింటి మధ్య పరస్పర సంబంధముంది. అవన్నీ పరస్పరం ఒకదానికొకటి అనుసంధానించబడినవే. వారి తీవ్రవాద ప్రణాళికలన్నీ ఒకే విషవలయానికి చెందినవి. ఈ విషయం బహిరంగ రహస్యమే. దీనికి తోడుగా అనేక సంస్థలు, కొన్ని రాజకీయ ముసుగులు, వారి బహిరంగ మరియు రహస్య అజెండాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. వీరందరూ జీహాదీ భావజాలం యొక్క విలక్షణ రాగాన్నే ఆలపిస్తుంటారు. తమ అంతిమ లక్ష్యమైన ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం అవన్నీ సమన్వయంతో పనిచేస్తుంటాయి. ప్రపంచంలో వీలైనంత విస్తృతమైన భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వారందరి ఉమ్మడి లక్ష్యం. అమెరికాకు తాను చేసిన వాగ్దానాలను తోసిరాజని తాలిబన్ ఇప్పటికే తమ అధీనంలోని భూభాగాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించడంలో పెద్దగా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఊహించినట్లుగానే భారతదేశంలో, ఎప్పుడూ దేశ వ్యతిరేక వైఖరినే అవలంబించే స్వతంత్ర చరిత్రకారులు, విద్యావేత్తల ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్స్, వ్యవస్థలను వ్యతిరేకించే, వ్యవస్థలపై నిరంతరం ఆగ్రహం వ్యక్తం చేసే నిత్య అసహనవాదులు, అసంతృప్త మేథావులు, కొన్ని పక్షపాత మీడియా సంస్థలు, మరికొందరు రాజకీయ నిరుద్యోగుల బృందం తాలిబన్ల పునరుత్దానాన్ని స్వాగతిస్తున్నారు. తమ తాత్కాలిక ప్రయోజనాలకోసం దేశ భద్రతను, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టటానికయినా వారెప్పుడూ సిధ్ధంగా ఉంటారు.
తీవ్రవాదానికి, ఇస్లాంకి సంబంధం లేదంటూ కొందరు చేస్తున్న తప్పుడు వాదనలు ఇకమీదట ప్రపంచ రాజకీయాలలో అంగీకారయోగ్యం కాకపోవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న కొన్ని దేశాల నాటకాలు కూడా ఇక చెల్లకపోవచ్చు.
ఈ గ్లోబల్ జిహాదీ ఉద్యమం అనేక తలలున్న రాక్షసుడు లాంటిది. తన దుర్మార్గమైన ఆశయాలను అది ఎంతోకాలం దాచదు. పరస్పర సమన్వయంతో, సహకారంతో కూడిన తీవ్రవాదుల యొక్క రహస్య కార్యకలాపాలు మరెంతోకాలం దాగి ఉండబోవు. ఆ రహస్య కాలం ఇక ముగిసిందనడానికి తాజా పరిణామాలే స్పష్టమైన ఋజువు. ఈ తీవ్రవాద గ్రూపులన్నీ అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. వాటి కార్యకలాపాలన్నీ ఖచ్చితమైన సమన్వయంతో సాగుతున్నాయి.
ఈ కఠిన వాస్తవాన్ని యావత్ ప్రపంచం వెంటనే గుర్తించాలి. తక్షణమే నాగరిక విలువలను గాఢంగా విశ్వసించే ప్రజలను రక్షించడం అత్యంత ఆవశ్యకం. అది అన్ని దేశాల తక్షణ కర్తవ్యం. అన్నీ సమైక్యంగా, స్పష్టమైన ప్రణాళికతో, నిర్ధిష్ట సమయ వ్యవధిలో ఖచ్చితమైన చర్యలకు ఉపక్రమిస్తేనే మానవజాతి గౌరవం మరియు ప్రపంచ శాంతి రక్షింపబడతాయి.





