
భాగ్యనగరం: దివ్యాంగులకు వినికిడి పరికరాలను సమదృష్టి క్షమతా వికాసం, అనుసంధాన మండలి(సక్షమ్, అఖిల భారత స్వచ్ఛంద సంస్థ) పంపిణీ చేసింది. అలాగే, పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించింది. ఇక్కడి నిలోఫర్ ఆస్పత్రిలోని ‘ప్రణవ్’ కార్యాలయంలో మూగ, చెవుడు సమస్యలున్న బాలలకు వీటిని ఉచితంగా పంపిణీ చేసింది.

ఈ సందర్భంగా సక్షమ్ జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రణవ్ ఫౌండర్ డైరెక్టర్ కాశీనాథ్ లక్కరాజు మాట్లాడుతూ ప్రణవ్‌లో 2018 జులై నుంచి వినికిడి సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు ప్రారంభించి, 2021 సెప్టెంబర్ వరకు దాదాపు 29 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. సక్షమ్ జాతీయ సహకార్యదర్శి, ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి మాట్లాడుతూ అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో పూణే నుంచి ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ అవినాశ్ విచ్చేయనున్నారని, వినికిడి, మాట సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు.

నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ పిల్లలకు వినికిడితో పాటు మాట తెప్పించే ప్రక్రియ కోసం సక్షమ్ విశేషంగా కృషి చేస్తోందని, ఇటువంటి గొప్ప కార్యక్రమం నిలోఫర్‌లో జరగడం సంతోషకరమంటూ సక్షమ్, ప్రణవ్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ ఉమాదేవి, సక్షమ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయ్ బండికట్ల, డాక్టర్ లక్ష్మి సమీరా(ఈఎన్‌టి సర్జన్), డాక్టర్ విజయ సారథి(హెచ్‌వోడీ నిమ్స్ న్యూరో సర్జరీ), డాక్టర్ అలిమేలు (నియోనాటల్ హెచ్‌వోడీ), డాక్టర్ హిమబిందు సింగ్(నియోనాటల్ ప్రొఫెసర్), డాక్టర్ స్వప్న(నియోనాటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్), తదితరులు పాల్గొన్నారు.





