
తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. ప్రత్యర్థి దేశం దాడి చేస్తే తిప్పికొట్టడానికి వీలుగా చేపట్టిన చర్యలను తెలియజేశారు.
లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె.మాథుర్ సహా లేహ్‌లో కార్గిల్, లేహ్, లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వత అభివృద్ధి మండలి ప్రతినిధులతోనూ రక్షణ మంత్రి సమావేశమయ్యారు. ఈ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు. ‘మహావీర్ చక్ర’ పురస్కార విజేత సోనమ్ వాంగ్‌చుక్ సహా అనేకమంది మాజీ సైనికులతో ఆయన ముచ్చటించారు. ‘‘భారత సైనికులకు, మాజీ సైనికులకు దేశం పట్ల ఎనలేని అంకితభావం ఉంది. దేశ భద్రతను వారు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అదే రీతిలో వారి సంరక్షణకు చర్యలు చేపట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉన్న కీలక సైనిక స్థావరాలను రాజ్‌నాథ్ సందర్శిస్తారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రతికూల వాతావరణంలో వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికుల నైతిక స్థయిర్యాన్ని పెంపొందించడం ఈ పర్యటన ఉద్దేశం. సరిహద్దు రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.





