
కోవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మంగళవారం మాట్లాడుతూ… ‘పాఠశాల అంటే టీచర్, హెల్పర్, విద్యార్థులు ఉంటారు. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్ల మనకు ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే అలా చేయడం మంచిది. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్ విజృంభించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైరస్ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమే. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్ కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈమేరకు ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంటుంది. ఇందులో రెండు మూడు మంత్రిత్వశాఖలు భాగస్వాములవుతాయి. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు.





