ArticlesNews

కరోనా సంక్షోభంలో… దేశానికి దన్నుగా భారత సైన్యం

470views

రోనా రెండో దశ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో… భారత సైన్యం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యంగా మనవారికి మామూలుగానే మంచి పేరు ఉంది. దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ మన సైనికులు…పౌర సమాజానికి విశేష సేవలు అందించారు.

ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపుతో రక్షణ దళాలు, అనుబంధ సంస్థలు కరోనా బాధితులను ఆదుకునేందుకు మేమున్నామని ముందుకొచ్చాయి. వైరస్ బాధితులకు క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులు నిర్వహించడానికి, వివిధ పరికరాలు సేకరించడానికి, మరమ్మతులు చేయడానికి అత్యవసర ఆర్థిక అధికారాలను రక్షణ మంత్రి… సైన్యానికి మంజూరు చేశారు. భారత ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలు.. నిర్వహిస్తున్న 25 ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు అందిస్తున్నారు. యుద్ధ విమానాలు తయారుచేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేవలం కోవిడ్ రోగుల చికిత్స కోసం లక్నోలో నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి ఈ  మే మొదటి వారంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బెంగళూరులో 250, 180 పడకల ఆసుపత్రులను హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ నిర్మించింది. మహారాష్ట్రలోని నాసిక్, ఒడిస్సాలోని కోరాపుట్ లో వైద్యశాలలు నిర్వహిస్తోంది.

రంగంలోకి డీఆర్డీఎ…

ఈ విషయంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఎ సైతం తన సేవలను అందిస్తోంది. ఆరు నగరాల్లో డీఆర్డిఏ నిర్మిస్తున్న ఆసుపత్రులు విషమ పరిస్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలు తమ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇస్తున్నాయి. భారత నావికా దళం, వైమానిక దళం సింగపూర్ తదితర దేశాల నుండి ద్రవరూప ఆక్సిజన్ ట్యాంకర్లను భారత్ కు వేగంగా చేరవేస్తున్నాయి. పి ఎం కేర్ నిధులతో దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం తాజాగా ప్రకటించింది..

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.