News

ఏప్రిల్ 11 నుండి 14 వరకు అందరికీ టీకాలు వేయండి : రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన

442views

దేశంలో మరోసారి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షించారు. కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో టెస్ట్‌లు చేయాలని సూచించారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నారని.. వాటిని ‘కరోనా కర్ఫ్యూ’లుగా పేరు మార్చాలన్నారు. రోజులో చేసే మొత్తం టెస్టుల్లో 70శాతం మేరకు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌లే నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భారీగా పాజిటివ్‌ కేసులు వస్తున్నా.. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని చర్యలు చేపట్టాలని సీఎంలను కోరారు. శాంపిల్స్‌ సేకరణ అత్యంత కీలకమన్నారు. ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌గా నిర్వహించాలన్నారు. 45ఏళ్లు నిండిన అందరూ టీకాలు వేయించుకొనేలా అవగాహన కల్పించాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా ఆయన మూడు ‘T’ ల సూత్రాన్ని ముఖ్యమంత్రులకు సూచించారు. ఆ మూడు T లు Test, Track, Treat అని చెప్పారు. కరోనా పరీక్ష (Test) ల సంఖ్య పెంచాలని, ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తికి సంబంధించి 30మందిని ట్రేస్ (Track)‌ చేయాలని, రోగ నిర్ధారణ అయినవారికి సరియైన వైద్య సౌకర్యం (Treat) కల్పించాలని ప్రధాని చెప్పారు.

‘రెండో దశలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. మరోసారి మనం కఠిన సవాల్‌ ఎదుర్కొంటున్నాం. కొవిడ్ టీకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. వచ్చే మూడు వారాలు భారత్‌కు మరింత కీలకం. టెస్టుల విషయంలో నిర్లక్ష్యం, పొరపాట్లు చేయొద్దు. మన దేశంలోనే వ్యాక్సిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ఒక్క రోజులోనే 40లక్షల మందికి టీకాలు వేయగలిగాం” అని చెప్పారు.

”నైట్‌ కర్ఫ్యూలను కరోనా కర్ఫ్యూలుగా ప్రమోట్‌ చేసి నిర్వహించాలి. కరోనా సోకిన వారిలో అధిక శాతం మందిలో లక్షణాలు ఉండటంలేదు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి. కంటైన్‌మెంట్‌ జోన్‌లకు సంబంధించిన సరిహద్దులు అస్పష్టంగా ఉండరాదు. టీకా వృథాను అరికట్టండి. జీరో వేస్టేజే లక్ష్యంగా ముందుకెళ్దాం. అర్హులైన ప్రతి పౌరుడూ టీకా వేసుకొనేలా చైతన్యం కలిగించాలి. అంతా కలిసి పనిచేస్తే కరోనాపై పోరాటంలో విజయం మనదే” అని ప్రధాని మోడీ అన్నారు.

ఈ దృశ్య సమీక్షలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి,ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, హరియానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కర్ణాటక సీఎం యడియూరప్ప సహా పలువురు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.