
ఉపఖండంలో ఉగ్రవాదంపై ఐరాస ‘ది అనలటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్’ టీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కర్ణాటక, కేరళల్లో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పేర్కొంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి దాదాపు 150-200 మంది ఉగ్రవాదులు అల్‌ఖైదాలో చేరి ఉండొచ్చని పేర్కొంది. వీరు ఉపఖండంలో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించింది.
పాక్ పాత్ర ఎక్కువ..
ముఖ్యంగా భారత ఉపఖండంలోని అల్ ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్(ఏఐఎస్‌క్యూ)ను తాలిబన్ నెట్‌వర్క్ హెల్మాండ్, కాందహార్ ప్రావిన్స్ నుంచి నిర్వహిస్తోందని పేర్కొంది. దీనికి ఒసామా మహమూద్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇతను పాక్ జాతీయుడు. ఏక్యూఐఎస్ తోపాటు ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ ది లెవంట్-ఖోర్సాన్, తెహ్రికీ తాలిబాన్ వంటి చాలా సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి ఉందని ది అనలటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్ టీమ్ పేర్కొంది. వీటన్నిటికీ పాకిస్థానీలే నాయకత్వం వహిస్తున్నారని పేర్కొంది. ఐఎస్‌ఐఎల్-కె అస్లామ్ ఫారూఖీ వంటివారిపై 1267 కమిటీ ఇంకా దృష్టి పెట్టలేదని పేర్కొంది. కాబూల్‌లోని గురుద్వారా పై దాడిలో ఫారూఖీ హస్తం ఉందని నమ్ముతున్నారు.





