
పూరీ (ఒడిశా): ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది రథయాత్ర జూలై 16 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
రథయాత్ర జరిగే ప్రాంతం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పరిధిలో సాధారణ డ్రోన్‌ల వినియోగంపై నిషేధం విధించారు.
రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే భద్రతా పర్యవేక్షణ, అధికారిక అవసరాల కోసం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే డ్రోన్లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
ఏరియల్ సర్వే, భద్రతా కార్యకలాపాలు, ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణ, మ్యాపింగ్, అధికారిక డాక్యుమెంటేషన్, విపత్తు నిర్వహణ వంటి అవసరాల కోసం డ్రోన్ల వినియోగానికి అవకాశం కల్పించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు.
లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహా వేడుకను సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు, పరిపాలనా యంత్రాంగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి.





