
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ వ్యాప్తంగా వెలసిన పోస్టర్లు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 53 మందితో కూడిన బ్యానర్లను నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. దాదాపు 100 పోస్టర్లు అంటించినట్లు లఖ్‌నవూ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. వీటిలో వ్యక్తుల పేర్లను వారి చిరునామాతో సహా ముద్రించారు. వీరంతా గత డిసెంబరులో హింసకు దారి తీసిన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నవారని జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాశ్ పేర్కొన్నారు. వీరికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. అల్లర్ల కారణంగా సంభవించిన ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.
డిసెంబరులో ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనలు పలుప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. నిరసనకారులు బస్సులను దగ్ధం చేశారు. పలు భవనాలపై రాళ్లతో దాడి చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్తి నష్టానికి కారణమైన వారి నుంచి పరిహారం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘర్షణల వల్ల దాదాపు రూ.1.55 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశామని అధికారులు తెలిపారు.





